తనువంతా.. తన్మయం

3 Feb, 2018 18:00 IST|Sakshi

గద్దెలపై సమ్మక్క, సారలమ్మ  

జనంతో పోటెత్తిన జాతర ప్రదేశాలు

తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు   

నేటితో ముగియనున్న జాతర  

నేడు వనంలోకి అమ్మవారలు

కరీంనగర్‌ : డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య.. కోయపూజారులు వనంలోంచి తీసుకురాగా.. కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్క, సారలమ్మ దేవతలు గద్దెలపై కొలువుదీరారు. ఇద్దరు అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లావ్యాప్తంగా జాతర ప్రాంగణాలు కిటకిటలాడాయి. పల్లె, పట్నం తేడాలేకుండా భక్తులదారులన్నీ జాతరవైపే కదిలాయి. మదినిండా అమ్మవార్లను ఉంచుకుని మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం వనదేవతలైన తల్లీబిడ్డలకు ఒడిబియ్యం సమర్పించారు. పసుపు, కుంకుమతోపాటు ఎత్తుబంగారం(బెల్లం) సమర్పించి చల్లగా చూడాలని వేడుకున్నారు. పోటెత్తిన జనం... జిల్లావ్యాప్తంగా 31 చోట్ల జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది హాజరై మొక్కులు సమర్పించుకున్నారు.

కరీంనగర్‌కు అనుకుని ఉన్న రేకుర్తి జాతరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు, హుజూరాబాద్‌లోని రంగనాయకులగుట్ట జాతరకు రెండున్నర లక్షలు, చింతకుంట, నగునూర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, ఇరుకుల్ల, బొమ్మకల్, జూపాక, సైదాపూర్, జమ్మికుంట, కేశవపట్నం, చొప్పదండి , ఆర్నకొండ, గుమ్లాపూర్, రాగంపేట, గంగాధర మండలం బూరుగుపల్లి, రామడుగు, తిర్మలాపూర్, గుండి, జమ్మికుంట, తనుగుల, వావిలాల, ఇల్లందకుంట, గన్నేరువరం, మానకొండూర్, దేవంపల్లి, కొండపల్కల, లింగాపూర్‌ జాతరకు సుమారు 50 వేల నుంచి లక్ష మధ్య భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. పలుచోట్ల జాతరలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శించుకుని భక్తుల ఏర్పాట్లు పరిశీలించారు. నేడు వనంలోకి.. నాలుగు రోజులపాటు భక్తుల పూజలందుకున్న సమ్మక్క, సారలమ్మ శనివారం సాయంత్రం కోయపూజారుల మధ్య వనం బాట పట్టనున్నారు. రెండేళ్లకోసారి జరిగే జాతర ఘట్టం ముగిసినట్లవుతుంది. నగర రోడ్లు నిర్మానుష్యం.. ఎప్పుడూ వాహనాల రద్దీతో గజిబిజిగా ఉండే జిల్లాకేంద్రంలోని రోడ్లన్నీ నాలుగు రోజులుగా నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రధాన చౌరస్తాలైన తెలంగాణచౌక్, కోర్టుచౌక్, కమాన్‌చౌక్, టవర్‌సర్కిల్, మంకమ్మతోట లేబర్‌ అడ్డా, మంచిర్యాల చౌరస్తా, రాంనగర్‌ చౌరస్తాలు సైతం బోసిపోయాయి.

మరిన్ని వార్తలు