పవర్‌ లేని ప్రథమ పౌరులు

8 Mar, 2019 13:16 IST|Sakshi
​​​​​​​గ్రామపంచాయతీ కార్యాలయం

బాధ్యతలు చేపట్టి నెల రోజులైనా అందని చెక్‌పవర్‌

పంచాయతీల్లో నిధులున్నా వెచ్చించలేని పరిస్థితి

పేరుకుపోతున్న సమస్యలు

సాక్షి, ముత్తారం(మంథని): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. వాటిని పాలించే వారే ప్రథమ పౌరులు. పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల రోజులైంది. గ్రామాలను ప్రగతి బాటలో నడపాలని.. గత సర్పంచుల దీటుగా అభివృద్ధి చేయాలని ఎంతో ఉత్సాహంగా కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలనుకున్నారు. పంచాయతీల ఖాతాల్లో నిధులు కూడా పుష్కలంగా ఉండడంతో పనులు ప్రారంభించడమే తరువాయి అనుకున్నారు. నెల రోజులైనా ప్రభుత్వం చెక్‌పవర్‌ ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తొచని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. మరోవైపు కొత్త పాలకవర్గం కొలువు తీరితే సమస్యలు పరిష్కారమవుతాయనుకున్న ప్రజలు నెలరోజులైనా ఏ పని ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందతున్నారు.

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు గత జనవరిలో మూడు విడతల్లో జరిగాయి. 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఎన్నికలు చాలా గ్రామాల్లో రసవత్తరంగా జరిగాయి. గెలుస్తాం అనుకున్న వారు ఓటమి పాలయ్యారు. ఓడిపోతారు అనుకున్నవారు గెలిచారు. కొత్త సర్పంచులు ఫిబ్రవరి 2న సర్పంచులు ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడిచినాఇప్పటికీ అధికారాల బదలాయింపు జరుగలేదు.

కొత్త సర్పంచులకు అన్ని గ్రామాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 263 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పంచాయతీల ఖాతాల్లో మూలుగుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్య సమస్యలు లేకుండా చేయాలని, మొదటగా మహిళల వద్ద మెప్పులు పొందాలనుకున్న సర్పంచులకు నిరాశే మిగిలింది. ప్రజలు వివిధ సమస్యలపై కొత్త స ర్పంచులను ఆశ్రయిస్తున్నారు. చెక్‌పవర్‌ లేకపోవడంతో సర్పంచులు దిగాలు చెందుతున్నారు.

పాత పంచాయతీలు - 228
కొత్త పంచాయతీలు - 65

ఎనిమిది నెలలుగా కుంటుపడిన అభివృద్ధి

గత సర్పంచుల పదవీకాలం 2018, జూన్‌లో ము గిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తమ విధుల్లోనే బిజీగా ఉన్న అధికారులు పల్లెలవైపు కన్నెత్తి కూడా చూడలేదు. వెళ్లినవా రు కూడా ఎలాంటి పనులు చేయించలేదు. కనీ సం డ్రెయినేజీలు కూడా శుభ్రం చేయించలేదు. ప్రత్యేక అధికారులు శాఖా పరమైన విధులకే పరి మితమయ్యారు తప్ప గ్రామాలపై దృష్టి సారించలేదు.

పారిశుధ్య లోపం, దీర్ఘకాలిక సమస్యలు, ఎనిమిది నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులు మొదలుకాక సతమతమైన ప్రజలు కొత్త పాలకులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్త సర్పంచ్‌లు పాత సమస్యలు వెక్కిరిస్తున్నాయి. తాజాగా ఎండలు కూడా ముదురుతుండతో చెరువులు, కుంటలలో నీరు అడిగంటుతోంది. బోర్లు వట్టిపోతున్నా యి. చేతిపంపులు పనిచేయడంలేదు. పల్లెల్లో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. సర్పంచులకు అధికారాల బదలాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు, మార్గదర్శకాలు విడుదల చేయలేదు.

మొదలు కాని స్వయం పాలన

జిల్లాలో ప్రస్తుతం 263 పంచాయతీలు ఉన్నాయి. గతంలో 228 పంచాయతీలు మాత్రమే ఉండగా, జిల్లాల పునర్విభజన, నూతన పంచాయతీరాజ్‌ చ ట్టం ప్రకారం ప్రభుత్వం గత ఆగస్టులో 500పైగా జనాభా ఉన్న అనుబంధ గ్రామాలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లాలో 65 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. పాత పంచాయతీలతోపాటు కొత్త పంచా యతీలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించింది. ఇన్ని రోజులు అనుబంధ గ్రామాలుగా, తండాలు గా ఉన్న పల్లెలో స్వయం పాలన మొదలవుతుం దని ప్రజలు సంతోషపడ్డారు. కానీ సర్పంచులకు చెక్‌పవర్‌ ఇవ్వకపోవడంతో పాత పంచాయతీలతోపాటు కొత్త పంచాయతీల్లో ఇప్పటికీ పాలన మొదలు కాలేదనే చెప్పవచ్చు.

పవర్‌పై స్పష్టత లేకనే..

కొత్త సర్పంచులకు చెక్‌ పవర్‌పై స్పష్టత రాలేదు. పంచాయతీల్లో ఏ పని చేసినా వాటికి సంబంధిం చి నిధులు విడుదల చేయడానికి గతంలో సర్పం చి, కార్యదర్శి పేరిట బ్యాంకులో ఖాతా ఉండాలి. ప్రస్తుతానికి ప్రత్యేకాధికారుల పేరు మీద ఉన్న ఖాతాలు మార్పిడి చేసి సబ్‌ ట్రేజరీ కార్యాలయం (ఎస్‌టీవో) కార్యాలయంలో నివేదించారు. ఇప్ప టి వరకు చెక్‌ పవర్‌ ఎవరికి ఇవ్వాలనే స్పష్టత లేక పోవడంతో  చెక్‌ పవర్‌ కేటాయింపులో జాప్యం జ రుగుతోందని సమాచారం. నూతన చట్టం ప్రకారం సర్పంచ్, ఉప  సర్పంచ్‌ ఇద్దరికీ ఖాతా ఉంటుందని గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది.

తాగునీటి సమస్య మొదలైంది

గ్రామాలలో ఇప్పటికే తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి. గతంలో వేసిన బోర్లు, చేతి పంపుల్లో నీరు అడుగంటి పోయింది. కొన్ని చేతి పంపులు మరమ్మతుకు నోచుకోవడంలేదు. విద్యుత్‌ మోటార్లు కూడా కాలిపోతున్నాయి. చెక్‌ పవర్‌ లేక ఏ పని చేయించలేకపోతున్నాం.
–సముద్రాల రమేశ్, సర్పంచ్, ఖమ్మంపల్లి

సమాధానం చెప్పలేకపోతున్నం

గ్రామాలలో సమస్యలను ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. గ్రామాలలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకు పోయాయి. పారిశుధ్యం లోంపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెక్‌ పవర్‌ ఇవ్వకపోవడంతో పనులు చేయలేక పోతున్నాం. ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నాం.
–తూటి రజిత, సర్పంచ్, ముత్తారం

మరిన్ని వార్తలు