వర్షాల కోసం ఎదురుచూపులుండవ్‌..!

12 Jan, 2018 09:09 IST|Sakshi

పంట ఎండుతదనే భయం ఇక ఉండదు

డిసెంబర్‌లోనే కాలువల్లోకి సాగునీరు

మార్చి 31లోపే రైతుల పంటలు ఇంటికి

రైతు సదస్సులో మంత్రి ఈటల

జమ్మికుంట(హుజూరాబాద్‌): రబీ, ఖరీఫ్‌ పంటలకు డిసెంబ ర్, జూన్‌లో సాగునీరు అందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. పట్టణంలోని ఎంపీఆర్‌ గార్డెన్‌లో హూజూరాబాద్, మానకొండూర్‌ డివిజన్‌ పరిధిలోని మండలాల్లోని రైతులకు ఈపాస్‌పై గురువారం అవగహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కడగండ్లు, వడగండ్ల వానలతో పంటలు ఎండి పోతాయా..? పంటలు దెబ్బతింటాయా అనే భయం లేకుండా వానల కోసం రైతులు ఎదురుచూడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. మార్చి, అక్టోబర్‌ మాసంలోనే రైతులు పండించిన పంటలు ఇంటికి చేరుతా యని అన్నారు.

కాలువల్లోకి ఎప్పుడు నీళ్లు ఇవ్వాలో అలో చించామన్నారు. స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి పార్లమెంట్, అసెంబ్లీల్లో రైతుల కోసం మాట్లాడని సభలు లేవ ని.. అయినా ఇప్పటి వరకు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో రైతులు బాగుం డాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పాలన సాగి స్తోందన్నారు. అందుకే రైతులకు 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నామనన్నారు. వర్షాలతో సంబంధం లేకుండా రైతులకు కాలువల ద్వారా నీరందించేందుకు నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గోదావరి అంటేనే రాజమహేంద్రవరం.. కృష్ణ అంటేనే బెజవాడ కనుకదుర్గమ్మ... అక్కడే పుష్కారాలు జరిగేవని అన్నారు. తెలంగాణ లో వందల కిలోమీటర్లు నీరు సాగినా చుక్క నీరు ఇవ్వలేని పాలకులు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

వచ్చే వర్షాకాలంలో కరీంనగర్‌ జిల్లా కరువంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి రాబోతుందన్నారు. రైతులు పంటలకు అప్పులు చేయకుండా వచ్చె మేలో రైతులకు పంట పెట్టుబడుల కోసం ఎకరానికి రూ.8 వేలు అందించబోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ముట్టుకునే పార్టీలను ప్రజలే పాతరేస్తారని అన్నారు. తమ పథకాలను తీసే దమ్ముంటుందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, నగర పంచాయతీ చైర్మన్‌ పోడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పింగిళి రమేశ్, సహకార సంఘాల రాష్ట్ర చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీపీ గిన్నారపు లత, ఏడీఏ దామోదర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బచ్చు శివశంకర్, ఎడవేళ్లి కొండాల్‌రెడ్డి, బండ శ్రీనివాస్, మొలుగూరి ప్రభాకర్, రాజిరెడ్డి, రాజజేశ్వర్‌రావు, ఏఈవోలు, ఏవోలు రైతులు పాల్గొన్నారు.

వ్యవసాయ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన మంత్రి
జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్‌ గార్డెన్‌లో (ఏఈవో)తెలంగాణ వ్యవసాయ విస్తర్ణ అధికారుల సంఘం సెంట్రల్‌ ఫోరం డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఈటల రాజేందర్‌ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ వ్యవసాయ సాగులో రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ రైతులను సేవలందిస్తున్న ఏఈవోలు సంఘం ఏర్పాటు అభినందనీయమన్నారు. రైతులకు ఉపయోగపడేలా డైరీ, క్యాలెండర్‌ రూపొందించడం సంతోషకరమన్నారు. రైతులకు సేవలందించడంలో ఏఈవోలు నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. మారుతున్న సాంకేతిక అధునీకరణ వ్యవసాయంపై రైతులను చైతన్యం చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఏడీఏ దామోదర్‌రెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు నీల తిరుపతి, కార్యదర్శి రాము, కోశాధికారి సతీశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మహేందర్, సెంట్రల్‌ ఫోరం రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివరాం, ఏఈవోలు మౌనిక, షబానా, రజిత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు