కేంద్రమంత్రి భార్యకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలి 

5 Feb, 2019 14:19 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత బేళూరు విమర్శలు  

సాక్షి, బెంగళూరు : కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు భార్య ఏ మతంవారని ప్రశ్నించిన కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డేపై కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ మండిపడ్డారు. హెగ్డే భార్య ఏ కులం వారో తెలుసుకోవటానికి డీఎన్‌ఏ పరీక్ష చేయించాలన్నారు. సోమవారం నగర కాంగ్రెస్‌ భవన్‌లో జిల్లా కాంగ్రెస్‌ ద్వారా ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొని మాట్లాడిన ఆయన హిందూ మహిళలను ముట్టుకొన్నవారి చేతులు కత్తిరించాలని అనంత్‌కుమార్‌  హెగ్డే చెప్పారని, ఆయన ఎంతమంది చేతులు కత్తిరించారో చెప్పాలని ప్రశ్నించారు.

కేపీసీసీ ప్రచార సమితి రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌.కే.పాటిల్‌ మాట్లాడుతూ గాంధీజీ ఫోటోను బొమ్మ తుపాకీతో కాల్చిన పూజా శకుల్‌పాండేను అరెస్టు చేయని పక్షంలో దేశ వ్యాప్తంగా పోరాటం చేపడతామన్నారు. కేపీసీసీ కార్యధ్యక్షుడు ఈశ్వర్‌ ఖండ్రె మాట్లాడుతూ గాంధీజీ బొమ్మను తుపాకీతో కాల్చినవారు దేశద్రోహులని మండిపడ్డారు. అనంత్‌కుమార్‌ హెగ్డేను తక్షణమే మంత్రి మండలి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. ఆనంద్‌రావు సర్కిల్‌ వరకు పాదయాత్రగా తరలి గాంధీ విగ్రహానికి మాలార్పణం చేశారు. ఆ తరువాత మహిళా కాంగ్రెస్‌ నేతలు పూజా శకుల్‌పాండెపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు