జూలై 5 తరువాత లాక్‌డౌన్‌?  

28 Jun, 2020 08:53 IST|Sakshi

ప్రతి ఆదివారం దిగ్బంధం 

నేటి నుంచి రాత్రి 8 నుంచి  వేకువ 5 వరకూ కర్ఫ్యూ

సాక్షి, బెంగళూరు: కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పదో తరగతి పరీక్షలు ఉన్నందున ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలిసింది. జూలై 5వ తేదీన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ముగియగానే.. కట్టుదిట్టమైన నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రణాళిక రచించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలో శనివారం సాయంత్రం ప్రత్యేక సమావేశంలో చర్చించారు.  (బెంగళూరు ప్రజలకు సీఎం వార్నింగ్)

పెరుగుతున్న క్రమంలో వారంతపు సెలవుల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉంటుందని చెప్పారు. అయితే జూలై 5వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. వారంలో ఐదురోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఆదివారం అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్‌ అని ప్రకటించారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, బస్సులతో పాటు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. నేడు ఆదివారం లాక్‌డౌన్‌ ఉండదు. కానీ రాత్రి నుంచి కర్ఫ్యూ నిబంధన అమల్లోకి వస్తుంది. జూలై 5 వరకు ఇప్పుడున్న నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు. (సినీ నటుల ఇళ్ల వద్ద కరోనా కలకలం)

కరోనా దండయాత్ర
ఓ వైపు వర్షాలు, మరోవైపు కరోనా కేసులతో రాష్ట్ర ప్రజలు సతమతం అవుతున్నారు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం కేసులు 11,923 ఉండగా, ఒక్క బెంగళూరులోనే 569 కేసులు శనివారం నమోదు అయ్యాయి.

పావగడలో సీల్‌డౌన్‌ 
పావగడ తాలూకాలోని మద్దిబండ, కణివేనహళ్ళి తండా పట్టణం లోని హాఫ్‌బండ, పాత కుమ్మరి వీధికి చెందిన నలుగురు వ్యక్తులకు కరోనా సోకిన నేపథ్యంలో ప్రాంతాలను సీల్‌ డౌన్‌ చేశారు. దీంతో పట్టణం లోని దుకాణాలు , సంత నిషేధించడంతో శనివారం పట్టణం బోసి పోయింది.  (ఒంటి చేత్తో మాస్కులు కుట్టిన సింధూరి)

మరిన్ని వార్తలు