న్యాయస్థానంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది

30 Sep, 2017 01:50 IST|Sakshi

వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలా? వద్దా?        

అన్నది పార్టీ హైకమాండ్‌ నిర్ణయిస్తుంది

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి

సాక్షి,బళ్లారి: రాబోయే రోజుల్లో బళ్లారిలో తాను ఉండేందుకు న్యాయస్థానం అనుమతి ఇస్తుందనే విశ్వాసం తనకు ఉందని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో  పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గనుల కేసుల్లో బళ్లారికి వచ్చి వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకోవాలనే ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. సత్య మార్గంలో నడిచే తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందన్నారు.

బళ్లారి అంటే తనకు ప్రాణమని, బళ్లారిలో ఉంటే ఇక్కడి ప్రజలకు సేవ చేసే భాగ్యం లభిస్తుందన్నారు. తన తల్లిదండ్రులు దసరాను   సంప్రదాయబద్ధంగా జరుపుకునే వారని, అదే తరహాలో తాను తన కుటుంబ సభ్యులతో దసరా జరుపుకునేందుకు బళ్లారికి వచ్చానన్నారు. బీజేపీలో తాను సామాన్య కార్యకర్తగా పని చేస్తున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలా? వద్దా? అన్నది బీజేపీ హైకమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు. ఉన్నంత వరకు బీజేపీ, ప్రజల కోసం పని చేస్తానన్నారు.  ఎంపీ బీ.శ్రీరాములు, ఆయన తనయుడు కిరీటిరెడ్డి తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు