చిరుత కోసం రిస్క్‌, ‘రియల్‌ హీరో’పై ప్రశంసలు

20 Jul, 2020 17:51 IST|Sakshi

బెంగుళూరు: మూగ ప్రాణులతో సహవాసం చేసే అటవీ శాఖ అధికారులు వాటిని కంటికి రెప్పలా కాచుకుని ఉంటారు. వేటగాళ్ల బారినపడకుండా నిత్యం కాపాలా కాస్తుంటారు. అడవి జంతువులకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే వెంటనే స్పందించి వాటిని రక్షిస్తారు. ఆ సమయంలో కొంత రిస్కైనా సరే వెనకడుగు వేయరు. కర్ణాటకలో ఆదివారం జరిగిన ఓ ఘటన ద్వారా అటవీ అధికారుల ధైర్యసాహసాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హెచ్‌డీ కోటే ప్రాంతంలోని ఓ బావిలో చిరుత పులి పడిపోయిందని అటవీ అధికారులకు సమాచారం అందింది. దాంతో మైసూరు అటవీశాఖ బృందం రంగంలోకి దిగింది. చిరుతను రక్షించేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సిద్ధరాజు బావిలోకి దిగేందుకు సమయాత్తమయ్యారు.
(చదవండి: స్ఫూర్తి నింపుతున్న కరోనా రోగుల డాన్స్‌!)
 
నీరు లేని బావిలో పడిన చిరుతను రక్షించేందుకు ఆయన 100 అడుగుల లోతులోకి వెళ్లారు. టార్చ్‌లైట్‌, మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని సిద్ధరాజు బోనులో కూర్చోగా స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది దానిని నెమ్మదిగా బావిలోకి దింపారు. అయితే, బావిలో చిరుత లేదు. బావిలో చిరుత పడిందని స్థానికులు పొరపాటుగా భావించడంతో అటవీ అధికారుల శ్రమ వృధా అయింది. ఇక ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాశ్వాన్‌ ఈ ఫొటోలను ట్విటర్లో షేర్‌ చేశారు. సిద్ధరాజు ధైర్యసాహసాలపై ప్రశంసలు కురింపించారు. విధినిర్వహణలో గ్రీన్‌ సోల్జర్స్‌ అంకితభావం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. చిరుత కోసం రిస్కు చేసిన సిద్ధరాజు రియల్‌ హీరో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(జిగేల్ మాస్కు: న‌యా ఆవిష్క‌ర‌ణ‌)

మరిన్ని వార్తలు