సిద్ధార్థ అంత్యక్రియలకు ఎస్‌ఎం కృష్ణ

31 Jul, 2019 12:43 IST|Sakshi

సంతాపంగా కాఫీడేల బంద్‌

సోషల్‌ మీడియాలో ప్రముఖుల సంతాపం

బెంగళూరు : ఆర్థిక ఒత్తిళ్లతో అదృశ్యమై విగత జీవిగా మారిన కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అంత్యక్రియలకు ఆయన మామ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ బయలు దేరారు. బెంగళూరులో తన స్వగృహం నుంచి అంత్యక్రియలు జరిగే బేళూరుకు పయనమయ్యారు. సిద్ధార్థ మృతికి సంతాపంగా దేశ వ్యాప్తంగా ఉన్న కేఫ్‌ కాఫీ డేలు ఈ రోజు (బుధవారం) బంద్‌ను పాటిస్తున్నాయి.  సోమవారం రాత్రి నుంచి అదృశ్యమైన వీజీ సిద్ధార్థ మృతదేహం నేత్రావతి నదిలో ఈ ఉదయం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్‌ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్‌.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. వీజీ సిద్ధార్థ మృతి పట్ల ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

సిద్ధార్థ మరణం షాక్‌కు గురిచేసిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘వీజీసిద్ధార్థ మరణించిన తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం నాకు దక్కింది. స్నేహపూర్వకంగా ఉండే జెంటిల్‌మెన్‌. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాఫీ డేకు ఈ కఠిన సమయాన్ని తట్టుకునే ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను.’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

‘సిద్ధార్థ ఎవరో నాకు తెలియదు. ఆయన ఆర్థిక సమస్యల గురించి కూడా అవగాహన లేదు. నాకు తెలిసింది ఒక్కటే పారిశ్రామికవేత్తలు వ్యాపార నష్టాలతో బలవన్మరణం పొందడం సరైంది కాదు. ఎందుకంటే ఇది పారిశ్రామికరంగాన్నే చచ్చిపోయేలా చేస్తుంది’- ఆనంద్‌ మహింద్ర.

మరిన్ని వార్తలు