నరాల్లో ఉత్తేజం

27 Feb, 2020 09:11 IST|Sakshi

పల్లె ప్రతిభకు నిదర్శనం

అరుదైన క్రీడకు శతాబ్దాల వారతస్వం

క్రికెట్, ఫుట్‌బాల్‌ టోర్నీలతో సమానంగా ఆదరణ. ఏడాదిపాటు దున్నపోతులు, పరుగువీరులకు శిక్షణ. గెలిస్తే దున్నలు, ఆటగాళ్లు, యజమానుల పేరు జిల్లాలో మార్మోగిపోతుంది. ఓడినవారు ఈసారి గెలవాలని మళ్లీ ప్రయత‍్నిస్తారు. ఒక గ్రామీణ క్రీడ కంబళ ఇప్పుడు అందరికీ హాట్‌ టాపిక్‌ అయ్యింది. కంబళ ఆటగాళ్లు ప్రపంచ పరుగు రికార్డులను అవలీలగా అధిగమిస్తుండడమే దీనికి కారణం. అంతేకాదు కంబళకు ఘనమైన వారసత్వ చరిత్ర కూడా ఉంది. కోస్తా జిల్లాల ప్రజల సంస్కృతిలో ఒక విడదీయలేని భాగం. 

సాక్షి, బెంగళూరు: బురద నీటిలో దున్నపోతులతో పోటీగా వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తి ప్రపంచ పరుగు పందెం విజేత ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును బద్దలుకొట్టి మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ, అలాగే నిశాంత్‌ శెట్టి అనే మరో కంబళ యువకుడు అదే 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తి శ్రీనివాసగౌడ రికార్డును బద్దలుకొట్టాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేల క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో అవలీలగా ఎలా సాధించేశారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కంబళ ఆటగాళ్లకు ఇంతటి శక్తిసామర్థ్యాలు ఎలా వచ్చాయనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.  

ఎలా ఆడతారంటే  
100 మీటర్లు అంతకంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు. తరువాత ఒకటి, లేదా జంట దున్నపోతులతో ఆటగాళ్లు రంగంలోకి దిగుతారు. ఎవరు వేగంగా అవతలికి చేరితే వారే విజేత. ఇది కూడా ఒక తరహా పరుగు పందెం అనే చెప్పాలి. అయితే సాధారణ ట్రాక్‌కు కంబళ ట్రాక్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణ ట్రాక్‌లో వేళ్లు, పూర్తి కాళ్లను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది. కానీ కంబళలో మడమలను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది.  
 
తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది 
ఈ పోటీల్లో ఏడు రకాలున్నాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళలుగా విభజించారు. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు. రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు.    

ఏడు రకాల కంబళలు  
కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, అడ్డా హాలేజ్, కేన్‌ హాలేజ్‌ ప్రధానమైనవి. ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వాటి గురించి పరిశీలిస్తే..   

నెగిలు  
చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఒక రకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు. ఈ భారీ నాగలిని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఎంట్రీ స్థాయి, జూనియర్, సీనియర్‌ రౌండ్లు మాత్రమే ఉంటాయి.  

హగ్గ  
ఈ విభాగంలో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురదనీటిలో పరుగెత్తుతాడు. ఇందులోనూ సీనియర్, జూనియర్‌ రౌండ్లు ఉంటాయి. 

అడ్డా హాలేజ్‌  
ఇది కాస్త కఠినంగానే ఉంటుంది. వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు. దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళ్తాయి. ఇందులో కేవలం సీనియర్‌ రౌండ్‌ మాత్రమే ఉంటుంది.  

కేన్‌ హాలేజ్‌  
ఈ రకం పోటీలు రసవత్తరంగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేక రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్‌ సీనియర్‌ రౌండ్‌ మాత్రమే ఉంటుంది.  

ఉడుపి, మంగళూరుకు ప్రత్యేకం  
కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలిచే ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ తదితర కోస్తా జిల్లాల్లో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ కంబళ. తమ సంస్కృతికి ప్రతీకగా ప్రజలు ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఒక ఊరిని మించి మరో ఊరివారు పోటీలు ఘనంగా ఉండాలని శ్రమిస్తారు. నవంబర్‌ నెలలో మొదలయ్యే కంబళ సీజన్‌ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ సమితుల ఆధ్వర్యంలో కంబళ పోటీలు నిర్వహిస్తారు. అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర ఉన్నవే. వీటిలో ఎక్కువ శాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తుంటారు. 

విజేతలకు బహుమానాల పంట  
కంబళలో పోటీల్లో గెలిచిన విజేతలను కొన్నిసార్లు నగదు బహుమానంతో మరికొన్నిసార్లు బంగారు నాణేలను బహుమానంగా అందించి సత్కరిస్తారు. గెలిచిన దున్నల యజమానులకూ పేరు లభిస్తుంది. ఆటగాళ్లు, చూసేవాళ్లలో కంబళ సాగుతున్నంతసేపూ ఉత్సాహం పొంగిపొర్లుతుంటుంది. కంబళ పోటీల కోసం దున్నలకు ప్రత్యేక శిక్షణనిస్తారు.  

శివుని భక్తుల ఆట  
కంబళ చరిత్ర శివునితో ముడిపడి ఉంది. పరమ శివునికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు. కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు. అందులో భాగంగా పంచకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మిథున క్రియలను పాటిస్తారు. దీంతోపాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు.  

మరిన్ని వార్తలు