కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

1 Dec, 2018 16:51 IST|Sakshi
 గ్రామస్తులతో మాట్లాడుతున్న లక్ష్మారెడ్డి  

సాక్షి,బాలానగర్‌ (జడ్చర్ల): టీఆర్‌ఎస్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఐకరాజ్య సమితి గుర్తించిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం బాలానగర్‌తోపాటు పరిధిలోని కేతిరెడ్డిపల్లి, గాలిగూడ, పెద్దాయపల్లి, చెన్నంగులగడ్డతండా, ఎక్వాయపల్లి, రాజ్యతండా, ఈదమ్మగడ్డతండా, ఉడిత్యాల, కుర్వగడ్డతండా, మేడిగడ్డతండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీల నుంచి ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పాలనలో సర్వతోముఖాభివృద్ధి సాధించిందన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేయడానికి, వలసలను నివారించడానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపడితే తమకు భవిష్యత్‌ ఉండదని గ్రహించిన నక్కజిత్తుల కాంగ్రెస్‌ నాయకులు కోర్టులో కేసు వేసి పనులు జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ప్రాజెక్టులను అడ్డుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం మహాకూటమి పేరుతో వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను తరిమికొట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపిన కేసీఆర్‌ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు కోదండరాంరెడ్డి, శంకర్, చెన్నారెడ్డి, శ్రీనివాసరావు, మైపాల్‌రెడ్డి, మోహన్‌నాయక్, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు