రహదారులు మృత్యుదారులు ఎందుకవుతాయంటే..

12 Sep, 2019 17:40 IST|Sakshi

బెంగళూర్‌ : మెరుగైన రహదారుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్‌ కర్జోల్‌ వ్యాఖ్యానించిన మరుసటి రోజే రోడ్లు బాగుండటంతో యువత ఎక్సలేటర్‌ను మరింతగా వాడుతుండటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. రోడ్లు బాగుంటే యువత వాటిపై హైస్పీడ్‌తో దూసుకెళతారని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి గౌడ పేర్కొన్నారు. చెత్త రోడ్ల కంటే మంచి రోడ్లపై యువత ఎక్సలేటర్‌ జోరును పెంచి వాహనాలను ముందుకు ఉరికిస్తారని ఈ క్రమంంలోనే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు.

కాగా, అధ్వాన్న రహదారుల కంటే మంచిగా ఉండే రోడ్లపైనే ప్రమాదాలు జరుగుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్‌ కర్జోల్‌ బుధవారం వ్యాఖ్యానించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘ఏటా కర్ణాటకలో 10,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి..వీటికి రోడ్లు దయనీయంగా ఉండటమే కారణమని మీడియా చెబుతుండగా..వాస్తవం మాత్రం రోడ్లు బాగా ఉండటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా’యని అన్నారు. ట్రాఫిక్‌ జరిమానాలపై నిరసనలు వెల్లువెత్తడంతో గుజరాత్‌ ప్రభుత్వ తరహాలో ట్రాఫిక్‌ ఉల్లంఘన జరిమానాలను తగ్గించాలని సీఎం బీఎస్‌ యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు