బురదలో పెరుగు కుండ

12 Oct, 2019 10:37 IST|Sakshi
బురద మట్టిలో పెరుగు కుండను పగులకొట్టే పోటీ

ప్రతి దసరాకూ సొంతూళ్లో వేడుకలు 

బిసలహళ్లి యువత ప్రత్యేకత 

మనిషి జీవన శైలిలో ఆధునికత పెనవేసుకునేకొద్దీ నగరవాసాన్ని ఇష్టపడుతున్నారు. సొంతూరిని, అక్కడి బంధుమిత్రులను మరచిపోతున్నారు. పెళ్లిళ్లు, చావులు వంటి ఎంత ముఖ్యమైన పని ఉన్నా తప్పించుకోవడమే పనిగా పెట్టుకున్న నేటి రోజుల్లో వారికి సొంతూరిపై ఉన్న మమకారం చూస్తే ముచ్చట వేస్తుంది. 

బురద మట్టిలో తాడులాగే పోటీలో వనితలు    

సాక్షి, బిరిబిదనూరు: గౌరిబిదనూరు తాలూకాలో సు మారు 200కు పైబడి కుటుంబాలున్న చిన్న గ్రామం బిసలహళ్ళి. ఇక్కడి యువకులు చదువులు, ఉద్యోగాల కోసం బెంగళూరులోనే ఎక్కువగా ఉంటారు. యువత దాదాపు ఉద్యాననగరిలో స్థిరపడిపోయింది. అయినా తమకు జన్మనిచ్చిన గ్రామాన్ని మరచిపోకుండా ఉండడానికి సుమారు 40 మంది యువకులు ఒక సంఘం ఏర్పాటు చేసుకుని పండుగలకు పబ్బాలకు కలుస్తూ పల్లె సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటారు. ‘ప్రేరణ సామాజిక, సాంస్కృతిక ట్రస్ట్‌’ పేరిట ఈ సంఘం ఏ ర్పాటు చేసుకొన్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాలలో నవమి, దశమి రోజులలో గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలకు వివిధ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. 2011 నుండి ప్రారంభమైన వీరి గ్రామ సేవ ఈ ఏడాది సైతం కొనసాగింది. 
       
ఈసారి మూడు రోజుల పండుగ  
గ్రామ పెద్దల సహాయ సహకారాలతో రెండురోజు లు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి కుటుంబంలోనూ బంధుమిత్రుల సరదా పలకరింపులు, విందు భోజనాలు సరేసరి. ఈ దసరాకు కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించారు. మొదటిరోజు బురద మట్టిలో పరుగు పోటీలు, బురద మట్టిలో తాడు లాగడం, బురద మట్టిలో పెరుగు కుండను పగులకొట్టడం, గ్రామీణ క్రీడాపోటీలను నిర్వహించారు. రెండవరోజు మహిళలకు రంగవల్లులు వేయడం, మంటలేకుండా వంట చేయడం, వరిధాన్యాన్ని రోకలితో దంచడం, విసురురాళ్ళతో రాగులు విసరడం తదితర పోటీలను నిర్వహించారు. వీటిలో ఎక్కువభాగం మహిళలకు సంబంధించినవే అయినా ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరగా గురువారం సాయంకాలం గ్రామ దేవుడు లక్ష్మీ నరసింహస్వామికి పల్లకీ ఉత్సవాలు ఘనంగా చేశారు. పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. యువతలో ఐక్యత వుండి జన్మస్థలంపై మమకారం వుంటే ఏమైనా సాధించ డానికి వీలుంటుందని ప్రేరణ ట్రస్టు అధ్యక్షుడు బి.ఎస్‌.నంజుండగౌడ తెలిపారు.  


వడ్లు దంచే పోటీ 


విసుర్రాయి పోటీ

మరిన్ని వార్తలు