బడ్జెట్‌పై చర్చ.. రచ్చ రచ్చ

20 Aug, 2019 09:54 IST|Sakshi

అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం

రసాభాసగా పాలికె సమావేశం

బెంగళూరు: బడ్జెట్‌పై బృహత్‌ బెంగళూరు మహానగర పాలికెలో జరిగిన చర్చ రసాభాసగా మారింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. సోమవారం బీబీఎంపీ కేంద్ర కార్యాలయంలో పాలికె కౌన్సిల్‌ సభ ప్రారంభం కాగానే బీబీఎంపీ బడ్జెట్‌పై పాలికె పాలన విభాగం నేత అబ్దుల్‌ వాజిద్‌ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె బడ్జెట్‌ను అడ్డుకోవడం తగదని, ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. అయితే యడియూరప్ప ముఖ్యమంత్రి అయిన వెంటనే పాలికె బడ్జెట్‌ను నిలిపివేశారని, దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు.

ప్రభుత్వం ఎందుకు పాలికె బడ్జెట్‌ను అడ్డుకుందని అంగీకరిస్తుందా లేదా అని సభలో పట్టుబట్టారు. దీనికి విపక్షనేత పద్మనాభరెడ్డి సమాధానమిస్తూ మీరు రూ.13 వేల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించారని, అయితే రూ.9 వేల కోట్లకు మాత్రమే ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందన్నారు. కానీ బెంగళూరు నగరాబివృద్ది శాఖ మంత్రి ఆర్దిక శాఖ ఆమోదించిన రూ.9 వేల కోట్లు నిధులను రూ.12,950 కోట్లకు పెంచిన నేపథ్యంలో అడ్డుకున్నారని తెలిపారు. నిధులు పెంచే అధికారం నగరాభివృద్ధి శాఖకు లేదని దీంతో ముఖ్యమంత్రి బడ్జెట్‌ను అడ్డుకున్నారని చెప్పడంతో కాంగ్రెస్‌ కార్పోరేటర్‌ శివరాజ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ పై నమ్మకంతో బెంగళూరులో నలుగురు ఎంపీలను ప్రజలు ఎన్నుకున్నారని గుర్తు చేయగా ఈ క్రమంలో శివరాజ్, పద్మనాభరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. శివరాజ్‌కు కాంగ్రెస్‌ కార్పోరేటర్లు మద్దతుగా నిలువగా పద్మనాభరెడ్డికి బీజేపీ కార్పోరేటర్లు మద్దతుగా నిలిచారు. దీంతో కొద్దిసేపు సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కమిషనర్‌ మంజునాథ్‌ప్రసాద్‌ సభను అదుపులోకి తీసుకువచ్చి పద్మనాభరెడ్డి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. కొన్ని సాంకేతిక కారణాలతో బడ్జెట్‌ను నిలుపుదల చేశారని నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని పద్మనాభరెడ్డి సభకు సమాధానమిచ్చారు.    

Read latest Karnataka News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా