బళ్లారికి ఆత్మీయ నేస్తం

8 Jul, 2018 12:21 IST|Sakshi
బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో తండ్రి వైఎస్‌ రాజారెడ్డితో కలిసి పాల్గొన్న వైఎస్సార్‌ (ఫైల్‌)

దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌కు అనుబంధం 

బళ్లారిలో డిగ్రీ పూర్తి 

ఇక్కడే ఎందరో స్నేహితులు  

ఆ వర్ఛస్సు, ఆత్మీయత చూసినవారు ఎన్నటికీ మరచిపోలేదు. పొరుగువారిని కూడా నీ వలె ప్రేమించు అన్న సూక్తిని అక్షరాలా ఆచరించారు కాబట్టే రాష్ట్రం, దేశం సరిహద్దులతో సంబంధం లేకుండా కోట్లాది మంది డాక్టర్‌ వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. బళ్లారి, కన్నడనాడు కూడా అందుకు మినహాయింపు కాదు. నేడు ఆదివారం ఆ దివంగత మహానేత జయంతి. 

సాక్షి, బళ్లారి: మేరునగ ధీరుడు ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవన ప్రస్థానం కన్నడనాడుతో ఎంతగానో ముడిపడి ఉంది. చిన్ననాటి నుంచి ఆయన విలక్షణమైన వ్యక్తి. వైఎస్‌ దివంగతులు కాగా ఆ బాధను గుండెల్లో దిగమింగుకుని, ఆయన జయంత్యుత్సవాలను కర్ణాటకలో కూడా అపారమైన ఆదరాభిమానాలతో నిర్వహిస్తుండడం విశేషం. వైఎస్సార్‌కు చిన్ననాటి నుంచే బళ్లారితో బంధం విడదీయలేనిదిగా కొనసాగింది. ఆయన బాల్యంతో పాటు సగం విద్యాభ్యాసం కూడా బళ్లారితో పాటు కర్ణాటకలో కొనసాగడంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే కర్ణాటకలో చెరగని ముద్ర ఉంది. వైఎస్‌ తండ్రి వైఎస్‌ రాజారెడ్డి ఇక్కడి మంచి విద్యాలయాలపై విశ్వాసంతో తన కుమారులను బళ్లారిలో విద్యాభ్యాసం చేయించారు. 

బళ్లారిలో డిగ్రీ, గుల్బర్గాలో ఎంబీబీఎస్‌ 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి బళ్లారిలో 1958లో 7వ తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు ఐదు సంవత్సరాల పాటు చదివి అనంతరం ఇంటర్మీడియట్‌ విద్యను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లయోల కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం 1964లో బళ్లారిలోని వీరశైవ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరారు. ఏడాది పాటు డిగ్రీ విద్య పూర్తి చేసుకున్న తర్వాత గుల్బర్గాలో ఎంబీబీఎస్‌లో చేరారు. ఇలా బళ్లారితో పాటు కర్ణాటకలో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది.

స్నేహితుల కష్టాలే తనవిగా... 
ఆయన చిన్నప్పుడు బళ్లారిలో చదువుకునే రోజుల్లో స్నేహితుల కష్టాలను పంచుకుని తనవిగా భావించి తీర్చేవారని నేటికి ఆయన స్నేహితులు వైఎస్‌తో జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటారు. వైఎస్సార్‌ చిన్ననాటి నుంచే పేదల పట్ల సేవాభావంతో పని చేసే గుణం అలవరుచుకోవడం వల్ల ఆయన రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్లి ఎన్నో మంచి పనులు చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

 వైఎస్‌ రాజశేఖరరెడ్డి విద్యాభ్యాసం బళ్లారిలో కొనసాగేటప్పుడు ఆయన ప్రతి నిత్యం ఇంటి నుంచి కాలి నడకన లేదా స్నేహితులతో కలిసి సైకిల్‌పై వెళ్లేవారని స్నేహితులు గుర్తుచేసుకుంటారు. భోజనం క్యారియర్‌ తీసుకుని వస్తే సగం స్నేహితులకు పంచి కొంచెం మాత్రం ఆరగించేవారని ఓ స్నేహితుడు తెలిపారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన బాల్యం, విద్యాభ్యాసం రెండూ బళ్లారిలో కొనసాగడంతో వైఎస్‌ఆర్‌కు కర్ణాటకతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆయన మిత్రులు, అభిమానులు సోమవారం ఘనంగా జయంత్యుత్సవాలు నిర్వహించనున్నారు. 

>
మరిన్ని వార్తలు