ఆపద'లో' మొక్కులవాడు!

20 Jan, 2018 08:05 IST|Sakshi

నేలకొండపల్లిలో వెంకన్నస్వామి భూములకు ఎసరు

50 ఎకరాల హాంఫట్‌ చేసిన వైనం

భూ రికార్డుల ప్రక్షాళనతో వెలుగులోకి

ఆపద మొక్కులవాడా..అనాథ రక్షకా పాహిమాం..అని మనం మొక్కే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భూములకే ఇప్పుడు రక్షణ కరువైంది. అధికారులు పర్యవేక్షణ లేక, బాధ్యులు పట్టించుకోక కబ్జాకోరులు నేలకొండపల్లిలో ఏకంగా 50ఎకరాలకు గోవిందనామం పాడుతున్నారు. ఇంకా కాజేసేందుకు కాచుక్కూర్చున్నారు. మరి బాధ్యులను ఏం జేస్తారు..? దేవుడి మాణ్యాన్ని ఎలా రక్షిస్తారో..? అని భక్తులు, జనం ఎదురుచూస్తున్నారు.

నేలకొండపల్లి: మండలకేంద్రం నేలకొండపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి 358ఎకరాల ఆస్తులు ఉండగా..వీటిపై కొందరు కన్నేశారు. విలువైన భూములను ఎంచక్కా కాజేస్తున్నారు. నేలకొండపల్లి, కమలాపురం, గువ్వలగూడెం, చిరుమర్రి, ముదిగొండ, మంగాపురం తదితర గ్రామాల్లో 358 ఎకరాలు ఈ దేవాలయానికి ఉన్నాయి. అయితే మంగాపురం గ్రామంలోనే 294.22 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ అక్కడ 100 ఎకరాలకే కౌలు వస్తోంది. అది కూడా కేవలం రూ.60 వేలు మాత్రమే. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళణ కార్యక్రమంలో అన్యాక్రాంతం వెలుగులోకి వచ్చింది. 294.22 ఎకరాలకుగాను 244 ఎకరాల భూమికి మాత్రమే పాస్‌ పుస్తకాలు ఇస్తున్నట్లు రెవెన్యూ  అధికారులు ఆలయ కమిటీకి తెలపడంతో..వారు కంగు తిన్నారు. కాల్వ అవసరాల రీత్యా ఎన్నెస్పీ అధికారులు కొంతభూమి తీసుకోగా..దాదాపు 50 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు వెలుగులోకి వచ్చింది. చెరువుమాధారంలో 38 కుంటల భూమికి గాను 28 కుంటలకు మాత్రమే పాస్‌ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇక్కడ 10 కుంటలు కబ్జా అయింది. దేవాలయం వెనుక కాసాయి గడ్డ కింద 9.23 ఎకరాలు భూములను నిరుపయోగంగా వదిలేయడంతో అవి బీడుబారాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే దేవుడి భూములు కనుమరుగవుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వివిధ గ్రామాల్లో ఆలయ భూముల వివరాలు ఇలా..
మంగాపురంతండా    294.22 ఎకరాలు
చెరువుమాధారం    38 కుంటలు
గంధసిరి    3.14 ఎకరాలు
చిరుమర్రి    8.22 ఎకరాలు
కమలాపురం    6.26 ఎకరాలు
గువ్వలగూడెం    12.13 ఎకరాలు
ముదిగొండ    3.26 ఎకరాలు
నేలకొండపల్లి    30 ఎకరాలు

భూములు అప్పగించాలి..
శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రికార్డుల్లో నమోదై ఉన్న భూములను అప్పగించాలి. ఆ లెక్కల ప్రకారమే పాస్‌ çపుస్తకాలు అందించాలి. 294.22 ఎకరాలకు గాను 244 ఎకరాలకే ఇస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశా. బోర్లు వేసుకోవడానికి కౌలురైతుల పేరున రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు. దీనిపై కూడా ఫిర్యాదు చేశాను. – చవళం వెంకటేశ్వరరావు,  దేవస్థానం చైర్మన్, నేలకొండపల్లి

ఇక విచారిస్తాం..
నేలకొండపల్లి దేవాలయం భూములు గెజిట్‌ ప్రకారం తక్కువగా ఉందని ఫిర్యాదు అందింది. మంగాపురంతండాలో క్షేత్ర స్థాయిలో విచారించి ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాం. – దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి

చర్యలు తీసుకోవాలి..
దేవాలయం భూములు అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. అన్యాక్రాంతమైన భూములపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి..బాధ్యులను శిక్షించాలి.   – వంగవీటి నాగేశ్వరరావు,సర్పంచ్‌

మరిన్ని వార్తలు