రైతుబంధు పేరుతో మోసం

13 May, 2018 14:53 IST|Sakshi

మంత్రుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది 

రూ. 4 వేలు ఇచ్చి జీవితమే మారిందంటున్నారు 

పెట్టుబడి పెరిగింది...    మద్దతు ధర కూడా పెంచాలి 

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క 

వైరా: రాష్ట్రంలో మంత్రుల మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని, ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ప్రజలను మోసం చేస్తోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. శనివారం వైరాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు శృతిమించి అధినాయకుడి మెప్పు కోసం పాలభిషేకాలు చేస్తూ అద్దె మైకుల్లా మాట్లాడుతున్నారని అన్నారు. రైతు బంధు పథకం వారి మాటల ప్రచారానికే ఉపయోగపడుతోంది తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు. 

నాలుగేళ్లుగా రైతులు అతి భయంకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, మద్దతు ధర లేకపోవడం, నకిలీ విత్తనాలు, గిట్టుబాటు ధర కోసం పోరాడితే బేడీలు వేయటం వంట వాటిని మరిపించేందుకే రైతుబంధు పథకాన్ని ప్రకటించారని ఆరోపించారు. రూ.4 వేలు చెల్లించి జీవితమే మారిపోయిందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎరువులు, విత్తనాల ధరలు ఆరేళ్ల క్రితానికి, ఇప్పటికీ విపరీతంగా పెరిగిపోయాయని, ఇప్పుడు ఇచ్చే నాలుగువేలు ఏ మూలకూ సరిపోవని అన్నారు. రైతుల ఆదాయం ప్రతి ఏడు తగ్గుతోందని, ధరలు పెరగటంతో దళారుల చేతుల్లో దగా పడుతున్నా రని చెప్పారు. 

ప్రస్తుతం మార్కెట్‌లలో ధాన్యం, మొక్కజొన్న కొనే పరిస్థితి లేకపోవటంతో తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారని చెప్పారు. అన్ని ఖర్చులు పెరగడం, పంటలకు ధర లేకపోవడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు కాంగ్రెస్‌ హయాంలో చట్టం చేశామని, ఆ చట్టాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు.  2019లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక చేస్తుందని అన్నారు. 

ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు లావూడ్య రాములు నాయక్, పీసీసీ అధికార ప్రతినిధి లోకేష్‌ యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు శీలం వెంకటనర్సిరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వేల్పుల జయరాజు, కిసాన్‌ సెల్‌ కన్వీనర్‌ దాసరి దానేలు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, జావీద్, తాజుద్దీన్‌ తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు