ధర గుట్టు రట్టు..

19 Jan, 2018 07:54 IST|Sakshi

మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లలో మాయ

రైతులు పసిగట్టడంతో ధర పెంచిన వ్యాపారులు

సిండికేటుగా ఏర్పడి మోసానికి పాల్పడుతున్న పరిస్థితి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నిత్యం రూ.లక్షల్లో దోపిడీ

ఖమ్మం వ్యవసాయం : మిర్చి కొనుగోళ్లలో మాయ జరుగుతోంది. పంటకు ఉన్న డిమాండ్‌నుబట్టి ధర పెట్టకుండా వ్యాపారులు దగాకు పాల్పడుతున్న వ్యవహారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం బట్టబయలైంది. జెండా పాటకన్నా కొందరు వ్యాపారులు మిర్చికి ధర అధికంగా పెట్టడంతో ఈ విషయం బయటపడింది. పొరుగు రాష్ట్రాలకు చెందిన మిర్చి వ్యాపారులు ఖమ్మం మార్కెట్‌కు వచ్చి మిర్చి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వటంతో నిత్యం మార్కెట్‌లో జరుగుతున్న ఈ వ్యవహారం వెలుగుచూసింది.  

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నిత్యం 12 నుంచి 15 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వస్తుంది. మార్కెట్‌కు వచ్చే మిర్చిని స్థానిక వ్యాపారులు, అంతర్జాతీయంగా ఎగుమతు లు చేసే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకాలం వీరు సిండికేటుగా ఉంటూ నిర్ణయించుకున్న ధరకు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పంటకు డిమాండ్‌ పెరగటం, ఎగుమతిదారులకు సరుకు అవసరం కావటంతో అసలు వ్యవహారం బయటపడింది. రోజు మాదిరిగా నే మార్కెట్‌ ఉద్యోగులు గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో మిర్చికి జెండా పాట నిర్వహించారు. ఇందులో గరిష్టంగా ఓ వ్యాపారి క్వింటాకు రూ.9,230 పాడాడు. ఈ ధరకు కొంత అటు ఇటుగా(నాణ్యతనుబట్టి) అమ్మకానికి వచ్చిన మిర్చిని మిగతా వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే ఇద్దరు వ్యాపారులు ఎగుమతిదారుల సలహాతో కొందరు రైతుల వద్ద క్వింటాకు రూ. రూ.9,400 నుంచి రూ.9,500 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో మిర్చికి మరికొంత ధర ఉన్నట్లు బయటపడటంతో విషయం తెలిసిన రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి యార్డు గేటు వద్ద కొందరు రైతులు మార్కెట్‌ ఉద్యోగులు, వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. సరుకు రవాణా చేసే వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  

రైతులు పసిగట్టడంతో..
జెండా పాటకన్నా ఇద్దరు వ్యాపారులు ధర అధికంగా పెట్టి కొనుగోలు చేయటాన్ని కొందరు రైతులు పసిగట్టారు. తమ పంట నాణ్యంగా ఉన్నా.. తక్కువ ధర పట్టడం ఏమిటని రైతులు కమీషన్‌ వ్యాపారులను నిలదీశారు. దీంతో మిర్చికి డిమాండ్‌ ఉన్న విషయం బయటపడింది. ఇది మార్కెట్‌ అంతా పొక్కడంతో రైతులు తాము పంట విక్రయించమని, తమ పంటకు కూడా ధర పెట్టాలని డిమాండ్‌ చేశారు.  

రెండోసారి జెండాపాట
మొదటి జెండా పాటకన్నా కొందరు వ్యాపారులు రైతుల నుంచి అధిక ధరతో కొనుగోలు చేస్తున్నారని, మరోసారి జెండాపాట నిర్వహిస్తున్నట్లు మార్కెట్‌ అధికారులు ప్రకటించారు. పాటలో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.700 అదనంగా ధర పెట్టారు. క్వింటాల్‌కు రూ.9,900 ధర పెట్టారు. రైతులందరూ తమ పంటకు ధర పెంచాలని కమీషన్‌ వ్యాపారులపై వత్తిడి తెచ్చారు. దీంతో మళ్లీ వ్యాపారులను పిలిచి.. పంటను పరిశీలించి నాణ్యత మేరకు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో ధర పెట్టాలని కోరారు. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు ధర పెంచి కొనుగోలు చేశారు.  

‘సిండికేటు’గా దోపిడీ..
వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి మిర్చిలో ధర దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర నిర్ణయించకపోవటంతో పంటకు ధర ఎంత పలుకుతుందనే విషయం రైతులకు తెలియటం లేదు. దీంతో వ్యాపారులు కూడపలుక్కొని ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఇలాగే తగ ఏడాది మిర్చి సీజన్‌లో ధర దోపిడీకి పాల్పడ్డారు.  

నిత్యం రూ.లక్షల్లో దోపిడీ
గురువారం ఖమ్మం మార్కెట్‌లో మిర్చి ధరలో వచ్చిన తేడాను పరిశీలిస్తే.. నిత్యం రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మార్కెట్‌కు 15వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. ఇది దాదాపు 7వేల క్వింటాళ్ల వరకు ఉంటుంది. పంట కొనుగోళ్ల ధరలో వచ్చిన తేడా వ్యవహారం బయటపడకపోతే రైతులు రూ.15లక్షల మేర దగాకు గురయ్యేవారు. ఈ లెక్కన నిత్యం మిర్చి ధరలో రైతులు రూ.లక్షల్లో దోపిడీకి గురవుతున్నట్లు విదితమవుతోంది.

మరీ ఇంత దగానా..
మిర్చికి ధర ఉన్నా తక్కువ ధర పెట్టారు. 22 బస్తాల మిర్చిని అమ్మకానికి తెచ్చా. మొదట క్వింటాల్‌కు రూ.9,230 చొప్పున కొనుగోలు చేశారు. తరువాత ధర పెరిగిందని తెలిసింది. మొదటి ధరకు ఒప్పుకోలేదు. దీంతో మరో రూ.200 ధర పెంచారు. ఇంత దగా చేస్తారనుకోలేదు.  – మాలోత్‌ సామ్యా, రైతు, సాతానిగూడెం, కామేపల్లి మండలం

క్వింటాల్‌కు రూ.300 పెంచారు..
21 బస్తాల మిర్చి అమ్మకానికి తెచ్చా. మొదట క్వింటాల్‌కు రూ.9,200 ధర పెట్టారు. ధర పెరిగిందని అంతా చెప్పటంతో కమీషన్‌ వ్యాపారిని ప్రశ్నించా. దీంతో మరో రూ.300 పెంచి క్వింటాల్‌కు రూ.9,500 చొప్పున ధర పెట్టాంచారు. మిర్చికి ధర ఉన్నా అన్యాయం చేస్తున్నారు. – నంద్యాల వెంకన్న, గట్టుసింగారం, కూసుమంచి మండలం

ధర ఘటనపై విచారిస్తాం..
మిర్చికి ధర ఉన్న విషయం తెలిసి మరోసారి జెండాపాట నిర్వహించాం. జెండాపాటలో ఖరీదుదారులంతా పాల్గొనలేదు. వ్యాపారులు జెండాపాటలో పాల్గొనకుండా రైతుల నుంచి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతాం. – రత్నం సంతోష్‌కుమార్, ఖమ్మం మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి

మరిన్ని వార్తలు