‘విజ్ఞానా’నికి బూజు.!

9 Feb, 2018 17:32 IST|Sakshi
వైరా, సిరిపురం పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న సైన్స్‌ పరికరాలు

వాడని సైన్స్‌ పరికరాలు 

ప్రయోగాత్మక విద్యకు దూరం

పట్టించుకోని అధికారులు 

వైరా : వంద అక్షరాల్లోని భావాన్ని ఒక్క చిత్రంలో చూపవచ్చు. వంద చిత్రాల సారాంశాన్ని ఒక ప్రయోగంతో వివరించవచ్చు. విద్యాశాఖలో మేధావులు నమ్మే విలువైన మాటలివి. ఆ దిశగా సత్ఫలితాలు సాధించడానికి ఏర్పాటు చేసిన ప్రయోగాత్మక బోధన.. చివరకు ప్రచార ఆర్భాటంగానే మిగిలింది. అంతంత మాత్రం నిధులు, అందీ అందని ప్రయోగ పరికరాలు, నిధులు దున్వినియోగం వెరసీ విద్యార్థులకు సైన్స్‌ విద్య అందడం లేదు. మౌఖిక బోధనతోనే పాఠాలు చెప్పి సరిపెడుతున్నారు. దీంతో విలువైన విజ్ఞాన పరికరాలకు దుమ్ము పడుతోంది.
  
సులువుగా అర్థమయ్యేలా.. 
నియోజకవర్గంలో మొత్తం 37 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో వైరా మండలంలో 9, కొణిజర్ల  మండలంలో 7, ఏన్కూరు మండలంలో 8, కారేపల్లి  మండలంలో 13 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 6,550 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాలపై మక్కువ పెంచడంతోపాటు సులభంగా అర్థమయ్యే వీలుగా ప్రభుత్వం ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టింది. తద్వారా పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కృత్యాధారంగా, ప్రయోగాత్మకంగా బోధించాలని ఆదేశించింది.

కొంతకాలం కిందట ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఈ మేరకు పాఠశాలలకు నేరుగా నిధులను విడుదల చేశారు. అందులో కొంత సొమ్ము వెచ్చించి పరికారాలు కొనుగోలు చేయాలనేది ఉద్దేశ్యం. అయతే ఎక్కడా ఆ లక్ష్యం నెరవేరలేదు. అందిన నిధులు అరకొర కావడం, ఆ నిధులతోనే మరిన్నీ కార్యక్రమాలు చేపట్టాల్సి రావడంతో అసలు సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల కొనుగోలు చేసిన పరికారలు వాడక మూలనపడ్డాయి. ఫలితంగా లక్ష్యం కుంటుపడటంతో పాటు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. 
 
నిధులున్నా పరికరాల్లేవ్‌.. 
2009–10 విద్యాసంవత్సరం నుంచి 2018వరకు ఉన్నత పాఠశాలలకు ఇచ్చిన నిధుల వివరాలను పరిశీలిస్తే.. 2009–10లో ఉన్నత పాఠశాలలకు రూ.4,687 చొప్పున, 2010–11లో రూ.17,125 చొప్పున, 2011–12లో రూ. 15వేల చొప్పున సైన్స్‌ పరికరాల కోసం నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. 2008 నుంచి 2010 వరకు ఆర్‌వీఎం ద్వారా ప్రాథమిక పాఠశాలలకు రూ.10వేల చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.50వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఏటా లక్షలాది రూపాయిల సొమ్ము పాఠశాలల నిర్వహణ, ప్రయోగ పరికరాల కోసం కేటాయిస్తున్నా.. ఆశించిన ఫలితం దక్కడం లేదు. 
 
ప్రయోగాత్మక బోధన కరువు... 
విద్యా బోధనలో కృత్యాధార, ప్రయోగాత్మక బోధనలు రెండూ కీలకం. ప్రస్తుత కృత్యధార బోధన జరుగుతోంది. గతంతో పోల్చుకుంటే పదేళ్ల కిందట పాఠ్య పుస్తకాల్లో చిత్రాలు తక్కువగా ఉండేవి. ప్రయోగత్మక బోధన లేకపోవడంతో కేవలం పాఠ్యాంశాలను చదివి చిన్నారులు ఊరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయోగాత్మక బోధనకు అవసరమైన ప్రయోగ పరికరాలను సమకూర్చడంతోపాటు, ఆ విధంగా బోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సైన్స్‌ పరికరాలతో విద్యాబోధన చేయాలి..  
ఉపాధ్యాయులు తప్పనిసరిగా సైన్స్‌ పరికరాలతోనే విద్యాబోధన చేయాలి. మారిన పుస్తకాల్లోని అంశాలతో ప్రయోగాలు చేస్తే పాఠాలు బోధించే పరిస్థితి లేదు. ప్రతి పాఠశాలలో ప్రయోగశాల ద్వారా బోధన చేయాల్సిందే. 
– కె. వెంకటేశ్వర్లు, ఎంఈఓ, వైరా 

మరిన్ని వార్తలు