దండుకున్నాడు..! దండించారు..!!

10 Feb, 2018 16:12 IST|Sakshi
సత్యనారాయణకు దేహశుద్ధి చేస్తున్న బాధితులు

సత్తుపల్లి : కొన్ని నెలల కిందటి వరకు అతడొక నిరుద్యోగి. ఆరు నెలల క్రితమే దినసరి కూలీగా సింగరేణిలో చేరాడు. ఈ ఆరు నెలల్లోనే అతడు బోల్డన్ని ‘అతి’ తెలివితేటలు సంపాదించాడు..! నమ్మకమనే పునాదులపై, మాయమాటలనే భవనాన్ని కట్టి చూపించాడు..!! ప్చ్‌.. ఏం లాభం..?! ఆ ‘పునాదులు’ కదిలాయి, ‘భవనం’ కుప్పకూలింది, పోలీస్‌ స్టేషన్‌కు చేరాడు. సత్తుపల్లి పట్టణ సీఐ మేడిశెట్టి వెంకటనర్సయ్య తెలిపిన ప్రకారం..
 
ఏం చేశాడంటే... 
ఆ దినసరి కూలీ పేరు గరిటపల్లి సత్యనారాయణ. వి.ఎం.బంజర్‌ ఎంప్లాయిస్‌ కాలనీలో ఉంటున్నాడు. ‘‘జేవీఆర్‌ ఓసీలో సూపర్‌వైజర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కాంట్రాక్ట్‌ పోస్టులు ఇప్పిస్తా’’నని ఎనిమిదిమందికి గాలం వేశాడు. ఇతగాడిని వారు పూర్తిగా నమ్మారు. 20వేల రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందన్నాడు. ముందుగా పదివేలు ఇవ్వాలన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతా పదివేలు ఇవ్వొచ్చన్నాడు. ఆ ఎనిమిది నుంచి మొత్తం 80వేల రూపాయలు వసూలు చేశాడు.
 
ఉద్యోగాలు వచ్చాయా..? 
ఎలా వస్తాయ్‌..? దుకాణానికి వెళ్లి వస్తువులు కొనుక్కున్నంత తేలిగ్గా ఉద్యోగాలను కొనుక్కోగలమా...? అలాగైతే, 20వేలేం ఖర్మ.. లక్షల రూపాయలు పట్టుకుని క్యూ కట్టే నిరుద్యోగులు చాలామందే ఉన్నారు. ‘ఉద్యోగం ఎప్పుడొస్తుందో’నని ఆ ఎనిమిదిమంది కలలు కంటూ, కళ్లు కాయలుకాచేలా ఎదురుచూశారు. సత్యనారాయణపై ఒత్తిడి పెంచారు. అతగాడు ఇంకా నమ్మించేందుకని, వారిని సింగరేణి కార్యాలయ పరిసర ప్రాంతాల్లో తిప్పసాగాడు. ‘‘డబ్బు ఇవ్వగానే ఉద్యోగం రాదు. రోజూ ఇలా తిరగాల్సుంటుంది’’ అని, ఏదేదో చెప్పాడు. ఇతని తీరుపై వారికి అనుమానం వచ్చింది. ఒక రోజున గట్టిగా నిలదీశారు. రేపోమాపో ఉద్యోగంలో చేరినట్టే. ఐడీ (గుర్తింపు) కార్డులు తీసుకొచ్చి ఇస్తా’’ అన్నాడు. ఆ ఎనిమిదిమంది సరేనన్నారు.
 
ఇవిగో ‘ఐడీ’లు..! 
‘అర్రె... ఉద్యోగాలొచ్చాయా..? ఐడీ కార్డులు కూడా ఇచ్చేశారా..?’.. ఇదిగో, అచ్చం మీలాగానే ఆ ఎనిమిదిమంది కూడా ఎగిరి గంతేశారు. అతగాడు ఇచ్చిన కార్డులను మురిపెంగా చూసుకుని, భద్రంగా జేబులో పెట్టుకున్నారు. నేరుగా సింగరేణి సంస్థ కార్యాలయానికి వెళ్లారు. వారిని లోపలికి సెక్యూరిటీ సిబ్బంది రానివ్వలేదు. వీరు అమాయకంగా, తమ జేబుల్లోని ఐడీ కార్డులు చూపించారు. ‘‘మీరెవరు? ఇవి ఎవరిచ్చారు? పోండి.. పోండి..’’ అని, గెంటేయడంతో నీరసంగా వెనుదిరిగారు. తాము పచ్చిగా మోసపోయామన్న బాధ ఒకవైపు, నమ్మించి మోసగించాడన్న కోపం మరోవైపు.. వారిని నిలకడగా ఉండనివ్వలేదు. నేరుగా సత్యనారాయణ వద్దకు వెళ్లారు.
 
ఏం చేశారు..?! 
చేయాల్సిందే చేశారు. ‘మనోడని నమ్మితే.. మమ్మల్నే మోసగిస్తావా..?’ అంటూ, పట్టుకుని కసితీరా తన్నారు. ఆ తరువాత నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. అతడు తమను ఎలా మోసగించిందీ పూసగుచ్చినట్టుగా వివరించారు. ఆ బాధితుల్లో ఒకరైన సుతారి కుమారస్వామి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గరిటపల్లి సత్యనారాయణపై కేసు నమోదైంది. దర్యాప్తు సాగుతోంది.
  
ఆ కార్డులెక్కడివి..? 
ఈ ఆరు నెలల్లో అతగాడు తెలివి మీరాడని పైన చెప్పుకున్నాం కదా..! సింగరేణి సంస్థ పేరుతో సత్తుపల్లిలో ఐడీ (ఐడెంటిటీ) కార్డులు తయారుచేయించాడు. వాటిని తీసుకొచ్చి వీరికి ఇచ్చాడు. అంతటితో తాను బయటపడినట్టేనని నమ్మినట్టున్నాడు. మోసం వెలుగులోకి వస్తే ఏమవుతుందో ఊహించినట్టు లేదు. ఆరు నెలల క్రితం అలా దండుకున్నాడు..! ఇప్పుడు, అతడిని ఆ బాధితులు ఇలా దండించారు..!! 

తస్మాత్‌ జాగ్రత్త... 
నిరుద్యోగులారా..! తస్మాత్‌ జాగ్రత్త..!! ఇలాంటి, మోసగాళ్లు ఇంకా అనేకమంది ఉన్నారు. ఇలాగే మోసగిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనగానే గుడ్డిగా నమ్మేయకండి.. వారి వలలో చిక్కుకోకండి.. మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోకండి.. ముందస్తుగా పోలీసులకు సమాచారమివ్వండి..!!!

మరిన్ని వార్తలు