‘పొగ’ కష్టాలు తప్పట్లేదు 

21 Feb, 2018 16:16 IST|Sakshi
పొగతో ఇబ్బంది పడుతున్న కార్మికులు

మధ్యాహ్న భోజన వర్కర్ల ఆందోళన

విద్యార్థులు, వర్కర్లకు తప్పని ఇబ్బందులు 

సత్తుపల్లిరూరల్‌ : మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిలపై చేసేందుకు వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టెలు దొరకక పోవటం.. అటవీ ప్రాంతాల నుంచి పుల్లలు తీసుకొచ్చే వీలు లేకుండా పోవటంతో కట్టెలకు కూడా డిమాండ్‌ పెరిగింది. పదిహేడేళ్లుగా కట్టెల పొగతో వంట చేస్తుండటంతో కళ్ల మంటలు వచ్చి కంటిచూపు తగ్గిపోతుందని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్‌ 2017 నాటికే మధ్యాహ్న భోజనం చేసేందుకు గ్యాస్‌ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు అమలుకు నోచుకోవటం లేదని మధ్యాహ్న భోజన వర్కర్లు వాపోతున్నారు. క్లాసురూంల్లోకి ఈ పొగ వెళ్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. ఇప్పటికైన ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్లకు గ్యాస్‌ను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. 

వర్షం వస్తే గొడుగుల కిందే..  
వర్షం వస్తే వంట షెడ్లు లేకపోవటంతో మధ్యాహ్న భోజన కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. భవనాల సన్‌సైడ్‌ కిందో.. గొడుగుల కింద వంటలు చేయాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన వంట పాత్రలు పాడైపోవటంతో సొంతంగా వంట పాత్రలు కొనుగోలు చేసుకొని వంట వండాల్సి వస్తోందంటున్నారు. పదిహేడేళ్ల నుంచి చేస్తున్నా.. కనీస వేతన చట్టం అమలుకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వడ్డించే బిల్లులు రెండు నెలలుగా అందక పోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పు, నూనె, కారం వంటి సరుకులు అప్పులు తెచ్చి వంట చేస్తున్నామని.. ప్రభుత్వం ఏ నెల బిల్లులు ఆ నెలలోనే చెల్లిస్తే తమ కష్టాలు తప్పుతాయంటున్నారు.  

గుడ్డు ధర పెరిగింది..   
మార్కెట్‌లో కోడి గుడ్డు ధర రూ.5 ఉండగా ప్రభుత్వం మాత్రం రూ.4 మాత్రమే చెల్లిస్తుండటంతో వారానికి రెండు సార్లు వడ్డించాలంటే నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలని కోరుతున్నారు. 

కళ్ల మంటలతో..  
కట్టెల పోయ్యి మీద వండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పొగతో కళ్లు మంటలు వస్తున్నాయి. ప్రభుత్వ గ్యాస్‌ సరఫరా చేస్తామని చెప్పినా అమలుకు నోచుకోవటం లేదు. పొగతో విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. 
– పూచి సీత, వర్కర్, సత్తుపల్లి 

Read latest Khammam News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు