స్థానిక సమరం.. గరం గరం

9 Mar, 2019 08:51 IST|Sakshi

సాక్షి, దమ్మపేట: పంచాయతీ పోరు మరవక ముందే స్థానిక సమరం మొదలవనుంది. మండల, జిల్లా పరిషత్‌లకు రిజర్వేషన్‌ ప్రక్రియను అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. మండల, జిల్లా ప్రాదేశిక సభ్యులు, ఎంపీపీ, జిల్లాపరిషత్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్లు త్వరగా ఖరారవడంతో మండల, జిల్లాపరిషత్‌ ఎన్నికల వైపు అందరి దృష్టి మళ్లింది. 2011 జనాభా లెక్కలు, కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు, గ్రామ పంచాయతీలు కలిసొచ్చేలా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. నియోజకవర్గంలో కొన్ని చోట్ల మాత్రమే ఎంపీటీసీ స్థానాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 


నియోజకవర్గంలో 58 ఎంపీటీసీ స్థానాలు

అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో మొత్తం 58 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో మండలాల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా చండ్రుగొండ మండలం నుంచి అన్నపురెడ్డిపల్లిని విభజించి మండలంగా ఏర్పాటు చేశారు. దమ్మపేట మండలం జమేదార్‌ బంజర్‌ ఎంపీటీసీ స్థానాన్ని లింగాలపల్లి కేంద్రంగా చేశారు.

అశ్వారావుపేట మండలంలోని బచ్చువారిగూడెం ఎంపీటీసీ స్థానంలో గాండ్లగూడెం పంచాయతీని కలపవద్దని అక్కడ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని పెద్దిరెడ్డిగూడెంలోని ఒక ఎంపీటీసీ స్థానాన్ని తొలగించి రాజాపురంలో కలపాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. దాన్ని ఆ స్థానం పరిధిలోని ఊటుపల్లి గ్రామస్తులు వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలగించిన స్థానాన్ని గుంపెనలో కలపాలని ఊటుపల్లి వాసులు కోరారు. ఆ రెండక అభ్యంతరాలు మాత్రమే అధికారులకు అందాయి.

 
ఎస్సీ, బీసీలకు దక్కని రిజర్వేషన్లు

ఈసారి ఎంపీటీసీల రిజర్వేషన్లలో ఎస్సీలు, బీసీలకు ఎక్కడా అవకాశం కల్పించలేదు. దీంతో వారి గొంతు మండల పరిషత్‌ సమావేశాల్లో వినపడదు. దీంతో ఆయా సామాజిక వర్గాలకు చెందినవారు జనరల్‌ స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అశ్వారావుపేట మండలంలో ఒక్క స్థానం మాత్రమే ఎస్సీలకు రిజర్వయింది. ఎంపీటీసీల రిజర్వేషన్ల విషయంలో తమకు జరిగిన అన్యాయంపై ఆందోళనకు దళిత, బీసీ సంఘాలు సిద్ధమవుతున్నాయి.

 
కొందరికి ఖేదం.. మరికొందరికి మోదం

మండల, జిల్లా ప్రాదేశిక సభ్యులు, ఎంపీపీల రిజర్వేషన్ల ఖరారుతో ఆశావహుల్లో కొందరికి అనుకూలం, మరికొందరికి ప్రతికూలంగా మారాయి. ఇప్పటికే ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలపై గంపెడాశతో ఉన్న నాయకులకు ఈ రిజర్వేషన్లు నిరాశపరిచాయి. 58 ఎంపీటీసీ స్థానాలకుగాను జనరల్‌కు  29 కేటాయించారు. ఎస్టీలకు  28 స్థానాలు రిజర్వయ్యాయి. అశ్వారావుపేట మండలంలో ఒక స్థానం మాత్రమే ఎస్సీలకు రిజర్వయింది. 
ఎంపీపీ రిజర్వేషన్ల విషయానికొస్తే అశ్వారావుపేట మాత్రమే జనరల్‌కు వెళ్లింది. దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాలు ఎస్టీ జనరల్‌కు, ములకలపల్లి, చంద్రుగొండ మండలాలు ఎస్టీ మహిళలకు రిజర్వయ్యాయి. జడ్పీటీసీల విషయంలో ఎస్టీలకు ములకలపల్లి స్థానం రిజర్వయింది. దమ్మపేట, చంద్రుగొండ మండలాలు జనరల్‌కు వెళ్లాయి. అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి మండలాలకు జనరల్‌ మహిళలకు కేటాయించారు. జనరల్‌కు కేటాయించిన జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌లో పోటీ తీవ్రంగా ఉంది.

 
నియోజకవర్గంలోని ఎంపీటీసీ స్థానాలు ఇవే.. 

అశ్వారావుపేట 17 
దమ్మపేట     17 
ములకలపల్లి     10 
చంద్రుగొండ 08 
అన్నపురెడ్డిపల్లి 06 

మరిన్ని వార్తలు