మెనూ.. అదిరెను

9 Jan, 2018 07:29 IST|Sakshi

 ‘కస్తూర్బా’లో కూరలు మారాయి..

 మటన్, చికెన్, గుడ్డుతో భోజనం

 కసరత్తులో నిమగ్నమైన యంత్రాంగం

 2,500 విద్యార్థినులకు ప్రయోజనం

ప్రత్యేక వసతి.. సకల సౌకర్యాలు.. మెరుగైన బోధన.. మంచి ఫలితాలు.. కోట్లాది రూపాయల వ్యయంతో భవన నిర్మాణాలు. విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ‘నూతన’ మెనూ. రాష్ట్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాలకు మరిన్ని నిధులు కేటాయిస్తూ.. నెలలో మూడుసార్లు చికెన్‌(కోడి మాంసం), రెండుసార్లు మటన్‌(మేక మాంసం), మిగతా రోజుల్లో గుడ్లు అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఖమ్మంజెడ్పీసెంటర్‌ : జిల్లాలోని 14 మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 2,533 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యాబోధన సాగుతోంది. 6వ తరగతిలో 440 మంది, 7లో 480 మంది, 8లో 571 మంది, 9లో 526 మంది, 10వ తరగతిలో 516 మంది విద్యార్థులున్నారు. బోనకల్, చింతకాని, కామేపల్లి, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, ముదిగొండ, పెనుబల్లి, తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, ఖమ్మం రూరల్, ఏన్కూరు, కూసుమంచి, సింగరేణి, రఘునాథపాలెం మండలాల్లో కస్తూర్బా పాఠశాలలున్నాయి.  

సౌకర్యాల్లో మేటి..
అనాథలు.. బడి బయట ఉండి.. చదువు మానేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. చదువుతోపాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది. భవన నిర్మాణాలను కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతోంది. నిరుపేదలకు చదువులు అందించేందుకు ఏర్పా టు చేసిన పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థినులకు ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు, కాస్మొటిక్స్, దుస్తులు అందిస్తున్నారు. చదువులు, ఆటలు, జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనికి తోడు కేజీబీవీల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. ఆన్‌లైన్‌ చేశారు. జిల్లా కేంద్రం నుంచి కేజీబీవీల్లో నిర్వహిస్తున్న తరగతులు, వారికి అందుతున్న ఆహారం, విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు తీసుకుంటున్న శ్రద్ధ తదితరాలను వీక్షించే వీలుంటుంది.  ఆరోప్లాంట్లతోపాటు బయోమెట్రిక్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.  

మెనూ ఇలా..
ఎదిగే పిల్లలు అనారోగ్యం బారినపడకుండా.. దారుఢ్యంగా ఉండేందుకు వసతులతోపాటు మంచి భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరైన ఆహారం అందిస్తే విద్యార్థినులు అలసట లేకుండా ఉల్లాసంగా ఉండడంతోపాటు చదువుపై మరింత శ్రద్ధ కనబరిచేలా ఈ ప్రణాళికకు రూపకల్పన చేసింది. దీంతో నూతన మెనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్‌ ఉంటుంది. వారంలో ఉదయం చపాతి, ఇడ్లి, ఉప్మా, పూరీ, ఇడ్లి, అటుకుల ఉప్మా ఉంటుంది. భోజనం బగారా, మొదటి, మూడవ, ఐదవ ఆదివారాల్లో చికెన్‌ మాంసం, రెండు, నాలుగో ఆదివారం మటన్‌ కర్రీ, వెజిటేబుల్‌ కుర్మా, మిగతా రోజుల్లో ఉడికించిన గుడ్డు, నెయ్యి, వీటితోపాటు పప్పు, రసం, బెండకాయ, ఆలుగడ్డ, పెరుగు, చిక్కుడు కూరలు ఉంటాయి. ఈవెనింగ్‌ స్నాక్స్, రాత్రి డిన్నర్‌లో రైస్, చట్ని, సాంబార్, బటర్‌మిల్క్, బీన్స్, అరటి(పండ్లు) అందించనున్నారు. 

టెండర్‌ ప్రక్రియలో ఉంది..  
ప్రభుత్వం కేజీబీవీ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. దీనిలో  మటన్, చికెన్, గుడ్డు విధిగా అందించేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధునులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మటన్, చికెన్‌ అందించేందుకు టెండర్ల ప్రక్రియ జరగనుంది. జేసీ, డీఈఓలు ఈ ప్రక్రియ చేపడుతున్నారు. మటన్, చికెన్‌తో భోజనం అందించేలా చర్యలు చేపడుతున్నాం – సూర్యదేవర అజిత, సెక్టోరియల్‌ అధికారి

మరిన్ని వార్తలు