‘జల’గాటం!

22 Jan, 2018 07:55 IST|Sakshi

పథకానికి ప్రచారం బరువు

గ్రామాల్లో అవగాహన కరువు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగునీరు..రైతులకు ఎంతో విలువైనది. ఇటు ఖరీఫ్, అటు రబీ సీజన్‌లలో పంటలు చేతికొచ్చే దశలో నీరందకుంటే కర్షకుడి పరిస్థితి తలకిందులే. ఇలాంటి కష్టం నుంచి గట్టెక్కించేందుకు,  రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో భూగర్భ జలాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు జలనిధి పథకంపై కనీస ప్రచారం లేకపోవడంతో ఎవరికీ తెలియని దుస్థితి నెలకొంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు జలనిధి (ఫారంపాండ్లు) నిర్మించాలనేది అసలు ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాలోని ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ..అసలు పనులే చేపట్టకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 2,17,584 రైతు జలనిధి (ఫారంపాండ్లు)మంజూరయ్యాయి. ఇందుకోసం రూ.85.23కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు కేవలం 47,109 ఫారంపాండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందుకోసం రూ.32.34 కోట్లు ఖర్చు పెట్టారు. జిల్లాలో రైతులు ఫారంపాండ్లు నిర్మించుకునేందుకు అంగీకారం తెలిపితే చాలు..నిధులు మంజూరు చేసేందుకు, అన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు నిధుల కొరత లేదు. కానీ..ప్రచారమే కరువైంది.  

రైతు జలనిధి అంటే..
వర్షాకాలంలో కురిసిన నీటిని నిల్వ చేసుకునేందుకు, తద్వారా భూగర్భ జలాలు పెంచుకునేందుకు ఫారంపాండ్లు నిర్మించుకునేందుకు ఈ రైతు జలనిధి పథకాన్ని చేపట్టారు. ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో పడ్డ వాననీరంతా వృథాగా సమీప కుంటలు, చెరువుల్లో కలుస్తోంది. సారవంతమైన మట్టి కూడా కొట్టుకుపోతోంది. రైతు పొలంలో పడ్డ వర్షపు నీటిని పొదుపు చేసుకుని, పంట అత్యవసర సమయాల్లో తడులు కట్టుకునేందుకు ఈ రైతుజలనిధి (ఫారంపాండ్‌) ఎంతో ఉపయోగపడుతుంది. రైతు పొలం, పై ప్రాంతాల్లో పడిన వర్షపునీరు ఏవైపు నుంచి ప్రవహించి బయటకు వెళుతుందో..పల్లపు ప్రాంతాన్ని గుర్తించి అక్కడ జలనిధిని కుంటను నిర్మించుకోవాలి. నీటిని ఎక్కువకాలం నిల్వ చేసుకునే ఉద్దేశం ఉంటే మొత్తం ఫారంపాండ్‌ అడుగుభాగం నుంచి అంచుల వరకు పాలిథిన్‌ లేదా ప్లాస్టిక్‌ షీట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. నీరు ఇంకి పోకుండా కొన్ని నెలలపాటు నిల్వ ఉంటుంది. తద్వారా భూమిలో తేమశాతం పెరుగుతుంది. చుట్టుపక్కల బోర్లు, బావుల్లో నీటి లభ్యత అధికమవుతుంది. అత్యవసర సమయాల్లో నీటిని విద్యుత్‌ మోటార్లతోకానీ, మనుషులతో కానీ పంటకు తడి అందించొచ్చు. ఫారంపాండ్‌ నిర్మించుకోవడానికి రైతులు ఉపాధిహమీ జాబ్‌కార్డు వివరాలతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ద్వారా ఉపాధిహామీ పథకం ఏపీఓ, ఎంపీడీఓను సంప్రదించవచ్చు.  

జలనిధిలో రకాలు..
ఉపాధి హామీ పథకంలో నాలుగు రకాల సైజుల్లో జలనిధి కుంటలను తవ్వుకోవచ్చు.  
అందుకు అవసరమైన ఖర్చు మొత్తం ఉపాధి హామీ పథకం నుంచి చెల్లిస్తారు.  
రెండు కుంటల భూమిలో నిర్మించుకునేందుకు రూ.50,588 చెల్లిస్తారు.  1.28లక్షల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చు.  
కుంటన్నర భూమిలో నిర్మించుకునేందుకు రూ.32,594 చెల్లిస్తారు. 50వేల లీటర్ల నీరు నిల్వ ఉంటుంది.  
కుంట భూమిలో నిర్మాణానికి రూ.23,106 చెల్లిస్తారు. 16వేల లీటర్ల వర్షపు నీరు నిలుస్తుంది.  
అర కుంట భూమికి రూ.14,926 చెల్లిస్తారు.   8వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఫారంపాండ్‌ను నిర్మిస్తారు.

మరిన్ని వార్తలు