కాసుల కష్టం మళ్లొచ్చె..

13 Jan, 2018 07:55 IST|Sakshi

డబ్బులు లేక మూతపడిన ఏటీఎంలు

కార్డు చేతబట్టుకొని రోజంతా ప్రదక్షిణలు

సంక్రాంతి సంబరాలకు ఇబ్బందే..

బ్యాంకుల తీరుపై ప్రజల ఆగ్రహం

బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు అవసరానికి ఉపయోగపడని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఎన్ని బ్యాంకుల ఏటీఎంలు ఉన్నా.. డబ్బులు రాని పరిస్థితి. ప్రస్తుతం నగదు కొరత కారణంగా ఏటీఎంలలో బ్యాంకింగ్‌ వ్యవస్థ డబ్బులు పెట్టలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం 2016, నవంబర్‌ 7న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వీటి స్థానంలో రూ.2,000, రూ.500 నోట్లను విడుదల చేసింది. రద్దు చేసిన పెద్దనోట్లను బ్యాంకుల్లో తమ ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రజల వద్ద ఉన్న నగదు డిపాజిట్‌ల రూపంలో బ్యాంకుకు చేరింది. అయితే బ్యాంకుల్లో చలామణి అయ్యే నగదు కొరత ఉండటంతో కొంతకాలం ఆర్బీఐ పలు నిబంధనలు విధించింది. నిత్యం రూ.4వేలు మాత్రమే విడుదల చేసుకోవచ్చనే షరతులు విధించింది. ఆ ప్రకారం కూడా వినియోగదారులకు నగదు అందించలేకపోయారు. అంతేకాక నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని బ్యాంకర్లను ఆదేశించాయి.

ఎన్ని సంస్కరణలు, మార్పులు చేసినా.. ప్రజలు మాత్రం నగదు కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి. ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా ఈ సంబురాలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల బ్రాంచ్‌లు దాదాపు 350కి పైగానే ఉన్నాయి. వీటికి చెందిన ఏనీటైం మనీ(ఏటీఎం)లు 227 ఉన్నాయి. ప్రజలకు అవసరమైన తీరుగా బ్యాంకులు, ఏటీఎంల ఏర్పాటు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎంత మాత్రం ప్రయోజనం లేదు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), ఆంధ్రా బ్యాంక్‌లకు చెస్ట్‌ వ్యవస్థ ఉంది. ఈ చెస్ట్‌ బ్యాంక్‌కు ఆర్బీఐ నగదు నిల్వలను పంపుతుంది. దీంతో మాతృ బ్యాంక్‌ బ్రాంచ్‌లతోపాటు పలు బ్యాంకులకు కూడా నగదు అందుబాటులో ఉంచుతారు.

ఆర్బీఐ నిత్యం ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌లకు రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు నగదును పంపుతుంది. దీనిని చెస్ట్‌ బ్యాంక్‌ ఎక్కడ నగదు కొరత ఉంటే అక్కడకు పంపుతుంది. ఈ నగదుతోపాటు బ్యాంక్‌ లావాదేవీలను కూడా వినియోగిస్తూ ప్రజలకు ఎటువంటి నగదు ఇబ్బందులు లేకుండా అధికారులు చూస్తుంటారు. ప్రస్తుతం నగదు కొరత కారణంగా ఆర్బీఐ చెస్ట్‌ బ్యాంక్‌లకు నగదును చాలినంతగా పంపించటం లేదు. మూడు, నాలుగు రోజులుగా చెస్ట్‌ బ్యాంకుల్లో రూ.10కోట్లకు మించి నగదు నిల్వలు లేవని, ఆ నగదును అత్యవసర బ్యాంకులకు పంపిస్తున్నారని సమాచారం. దీంతో నగదు సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాలతోపాటు మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, మణుగూరు, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందు, వైరా, కూసుమంచి కేంద్రాల్లో నగదు కోసం ఇబ్బంది పడుతున్నారు.


ఏటీఎంల చుట్టూ..
పండగ కోసం జీతం డబ్బులు డ్రా చేసుకుందామని ఉదయం నుంచి ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా. గాంధీచౌక్, రాపర్తినగర్, జూబ్లీపుర సెంటర్లలో ఉన్న ఏటీఎంలకు వెళ్లా ఎక్కడా నగదు లేదు. ఏమి చేయాలో అర్థం కావటం లేదు. పండగకు పిల్లలకు బట్టలు తీసుకుందామనుకున్న కోరిక తీరుతుందో..? లేదో..?
– లావుడ్యా తావుర్యా, రికార్డ్‌ అసిస్టెంట్, ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాల
 
ప్రభుత్వ వైఫల్యమే..

నగదును అందుబాటులో ఉంచకపోవటం ప్రభుత్వ వైఫల్యమే. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు నగదు డ్రా చేసుకుంటారనే విషయం బ్యాంకింగ్‌ వ్యవస్థకు తెలియదా..? ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు..? నగదు బ్యాంకులో ఉంచుకొని డ్రా చేసుకోలేక పోతున్నాం. పది ఏటీఎంల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు.  
– అశోక్, ప్రైవేటు ఉద్యోగి, ఖమ్మం

మరిన్ని వార్తలు