స్మార్ట్‌ ఫోన్లో పబ్జీ భూతం..ఆడితే ఇక అంతే..

5 Mar, 2019 08:31 IST|Sakshi
పబ్జీ గేమ్‌

సమయాన్ని వృథా చేసుకుంటున్న యువత 

చదువుపై తగ్గుతున్న శ్రద్ధ, ఏకాగ్రత లేక చికాకులు 

హింసాప్రవృత్తి గేములొద్దంటున్న పెద్దలు  

సాక్షొ, వైరారూరల్‌: ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లలో కొన్ని రకాల ఆటలకు యువకులు బాకా ఆకర్షితులవుతూ..సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అర్ధరాత్రుళ్ల వరకూ ఫోన్లలో ఆటలాడేలా ప్రేరేపిస్తున్న గేముల్లో పబ్జి అనేది ముఖ్యంగా కనిపిస్తోంది. ఈ ఆట ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా ఆడుతున్నారు. ఒక్కరు, ఇద్దరు లేదా నలుగురు కలిసి ఒకేసారి ఆన్‌లైన్‌లో ఆడవచ్చు. ముగ్గురు కలిసి కూడా ఆడొచ్చుకానీ..అధికశాతం నలుగురు మిత్రులు వేర్వేరు ప్రాంతాల నుంచి ఒక టీం మాదిరి ఏర్పడి ఆన్‌లైన్లో ఈ ఆటను ఆడుతున్నారు. గేమ్‌లో ఒక ఐలాండ్‌ ఉంటుంది. అందులో విమానం నుంచి 100 మంది వారికి నచ్చిన ప్రదేశాల్లో దిగుతారు. ఇందులో నలుగురు మిత్రులు ఉంటారు. వీరికి మిగిలిన 96 మంది శత్రువులవుతారు. ఆ 96 మందిలో సైతం నలుగురితో కూడిన పలు టీంలు ఉంటాయి. వారికి 96 మంది శత్రువులుగా భావిస్తారు.

అదే ఒక్కరు ఈ ఆటను ఆడితే.. మిగిలిన 99 మంది.. ఇద్దరు కలిసి ఆడితే మిగిలిన 98 మంది సభ్యులు వారికి శత్రువులు అవుతారు. ఎవరికి వారే బృందాలుగా ఏర్పడి ఐలాండ్‌లోకి దిగిన వెంటనే ఇళ్లలోకి చొరబడి లూటీలు చేస్తారు. ఈ ఆటను ఆడేందుకు కావాల్సిన పలు రకాల తుపాకీలు, స్కోప్స్, కారు, ద్విచక్రవాహనాలు, ఎనర్జీ డ్రింక్స్‌ వంటివి వారు దోచుకుంటారు. ఈ క్రమంలో దాడి చేసిన వారిపై  ప్రతి దాడులు చేసి వారిని హతమారుస్తారు. పలు ప్రదేశాల్లో ఉన్న శత్రువుల వద్దకు కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లి వారిని చంపుతారు. శత్రువులను సిగ్నళ్ల ద్వారా కనిపెడతారు. వెతికే క్రమంలో బ్లూ, వైట్‌ అనే రెండు సర్కిళ్లు ఉంటాయి. పొరపాటున బ్లూ సర్కిల్‌లోకి ప్రవేశిస్తే..వారు శక్తిని కోల్పోతారు. లేదా చనిపోయే ప్రమాదముంది. వైట్‌ సర్కిల్‌ సేఫ్‌ జోన్‌. ఆట మొత్తం మీద విమానం మూడుసార్లు ప్రవేశించి పలు రకాల తుపాకులు, స్కోప్స్, బాంబులు, బాణాలు జారవిడుస్తుంది.

పబ్జి ఆటకు చాలామంది యువకులు బానిసలుగా మారి..కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిని బహిష్కరించాయి. ప్రత్యర్థులను ఎలా అంతమొందించాలి?,  గెలవాలంటే ఎలాంటి తుపాకులను వినియోగించాలి? ఐలాండ్‌లో తిరిగేందుకు ఏ వాహనం ఎంచుకోవాలి? అని తరచూ ఆలోచిస్తూ మానసికంగా దెబ్బతింటున్నారు. ఆటలో ఇతరులను ఇష్టారీతిన చంపేస్తూ హింసాప్రవృత్తి పెంచుకోవడం బాధాకరం. ఈ ఆట ఆడేవారిలో చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. ఈ çపబ్జి భూతంతో అనేకమంది బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. ఇళ్లలో పెద్దలు దృష్టిసారించి..ఇలాంటి గేమ్స్‌ ఆడకుండా చూడాలని మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు.

ఆడితే హడలే.. 
బూర్గంపాడు: పబ్జి కార్పొరేషన్, బ్లూహోల్‌ సంస్థలు సృష్టించిన ఈ పబ్జి ఆటను ఆన్‌లైన్‌లో ఆడుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కాల్పులు, విధ్వంసం, హత్యలు వంటి ప్రక్రియలను ఓ గేమ్‌లోని చిన్న అంశంగా తీసిపారేస్తున్నారు. గతంలో ల్యాప్‌టాప్, కంప్యూటర్లకే పరిమితమైన ఈ ఆట ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో హల్‌చల్‌ చేస్తోంది. ఆటలో భాగంగా దాడులు, హత్యలు చేయడం వంటివి తొలుత సరదాగా అనిపించినా రానురానూ యువతలో, పిల్లల్లో మానసికంగా రాక్షసత్వాన్ని నింపుతున్నాయి. గంటల తరబడి ఈ గేమ్‌ నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. చదువులు, ఇతర వ్యాపకాలను పక్కకు పెట్టి కేవలం ఆన్‌లైన్‌ గేమ్స్‌కే కొందరు బానిసలుగా మారుతున్నారు. ఈ గేమ్‌ పిచ్చి బాగా ముదిరిన వారు..వింత చేష్టలతో మానసికంగా దెబ్బతింటున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించి, పిల్లలు స్మార్ట్‌ఫోన్లలో విపరీతమైన ఆటలు ఆడకుండా చూసుకోవాలి.  

నియంత్రించాలి.. 
ఆన్‌లైన్‌ గేమ్స్‌ను నియంత్రించకుంటే పిల్లల భవిష్యత్‌ ఇబ్బందుల పాలవుతుంది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వలన మానసిక పరిపక్వత మందగిస్తుంది. పిల్లలు ఈ ఆటలకు బానిసలైతే ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు ఎక్కువవుతాయి. దీంతో వాళ్ల భవిష్యత్‌ పూర్తిగా దెబ్బతింటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు దూరంగా ఉంచాలి.  
– డాక్టర్‌ శంకర్‌నాయక్, వైద్యనిపుణుడు       

మరిన్ని వార్తలు