మీట నొక్కు..పింఛన్‌ పట్టు

30 Dec, 2017 13:14 IST|Sakshi

జీవన్‌ ప్రమాణ్‌ పథకంతో లబ్ధి

ధ్రువీకరణ పత్రాల జారీ ఇక సులభతరం

ఖమ్మం, వైరా:  విశ్రాంత ఉద్యోగులు పింఛన్‌ పొందాలంటే ఇక సులభ ప్రక్రియ అందుబాటులోకి వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్‌ డిజిటల్‌ ఇండియాలో భాగంగా..కేంద్ర ప్రభుత్వం జీవన్‌ ప్రమాణ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. పెన్షనర్లు ఏటా నవంబర్, డిసెంబర్‌ నెలల్లో జీవించి ఉన్నట్లు ధ్రవీకరణపత్రం (లైవ్‌ సర్టిఫికెట్‌) ఖజానా కార్యాలయాలు, బ్యాంకుల్లో విధిగా అందజేయాలి. వీటి కోసం వృద్ధులు ప్రతీ సంవత్సరం నానా కష్టాలు పడుతుంటారు. 10–15 రోజుల పాటు గెజిటెడ్‌ అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది.

పెన్షనర్ల బాధలను తొలగించాలనే సదుద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బయోమెట్రిక్‌ ద్వారా జీవన ధ్రువీకరణ పత్రం పొందే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.  జీవన్‌ ప్రమాణ్‌ అనే పోర్టల్‌ ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేసే అవకాశమొచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర, సత్తుపల్లి, వైరా, నేలకొండపల్లి, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట పరిధిలో 12,500 మంది పైగా పెన్షన్షర్లు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 45వేల మందికి పైగా ఉన్నారు. వీరందికీ కొత్తగా కల్పించిన అవకాశం వల్ల ఇక  ‘మేం జీవించి ఉన్నాం’ అని ప్రతిసారీ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా..బయోమెట్రిక్‌ యంత్రంపై మీటనొక్కితే చాలు. ఇక ఆగకుండా పెన్షన్‌ అందుతుంది. 

నమోదు ప్రక్రియ ఇలా..
www.jeevanpramaan.gov.in అనే వెబ్‌సైట్‌లో జీవన్‌ ప్రమాణ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యమవుతాయి. సెల్‌ఫోన్‌ నంబర్, ఆధార్‌కార్డు సంఖ్య ఆధారంగా సమగ్ర వివరాలతో పేరు నమోదు చేసుకుంటే బయోమెట్రిక్‌ విధానం ద్వారా డిజిటల్‌ ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది. ఖాజానా, బ్యాంకు అధికారులు ఈ వెబ్‌సైట్‌ ద్వారా సంబంధిత పెన్షనర్ల లైఫ్‌ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ సంఖ్య పెన్షన్‌ పేమేంట్‌ ఆర్డర్‌ బ్యాంకు ఖాతా సంఖ్య, ఫోన్‌నంబర్‌ వివరాలు పొందుపర్చాలి. ఆధార్‌లోని వేలిముద్రలు వైబ్‌సైట్‌లో తాజాగా నమోదు చేసే వేలిముద్రలు సరిపోతే పెన్షన్‌దారులకు రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లు. సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం అందుతుంది. ఆ తర్వాత జీవన్‌ ప్రమాణ్‌ ప్రత్యేక గుర్తింపు సంఖ్య వస్తుంది. ఈ సంఖ్యలో ప్రత్యేక డిజిట్‌ «ధ్రువీకరణపత్రం జారీ అవుతంది. ఒక్కసారి జీవన్‌ ప్రమాణ్‌ డిజిటల్‌ ధ్రువీకరణ పత్రం జారీ అయితే..ఆ తర్వాత జీవన్‌ప్రమాణ్‌ పోర్టల్లో వేలిముద్రలు వేస్తే సరిపోతుంది. ప్రతి ఏటా కార్యాలయాలు, అధికారల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండదు.

ఈ విషయాలు కీలకం..
సంబంధిత సైట్‌లోకి వెళ్లాక..హోమ్, ఎబౌట్, సెండ్‌యువర్‌ ఆధార్, గెట్‌ ఏ సర్టిఫికెట్‌ అనే వివరాలు కనిపిస్తాయి. ఎబౌట్‌ సైట్‌లో జీవన్‌ ప్రమాణ్‌ ధ్రువీకరణ పత్రం నమోదుకు సంబంధించిన వివరాలు పూర్తిగా పొందుపరిచారు. గెట్‌ ఏ సర్టిఫికెట్‌ సైట్‌లో పీసీల ద్వారా, ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌ ద్వారా జీవనప్రమాణ్‌ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా పెన్షనర్లు ఇక ఏటా నవంబర్‌ నెల నుంచి వేలిముద్రలు వేసే అవకాశం లభిస్తుంది.

మరిన్ని వార్తలు