దర్జాగా కబ్జా..

12 Jan, 2018 09:42 IST|Sakshi

రోజురోజుకు చిక్కిపోతున్న సాగర్‌ పంట కాల్వలు

ఎక్కడికక్కడ ఆక్రమించుకుంటున్న రియల్‌ వ్యాపారులు

ఇప్పటికే 50 ఎకరాల వరకు భూమి మాయం

పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు

ఖమ్మం: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సాగర్‌ కాల్వలు వరంలా మారాయి. పంట పొలాలకు నీరందించే కాల్వలను కొల్లగొడుతూ.. పక్కనే తమ వెంచర్లలో యథేచ్ఛగా విలీనం చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. రైతులు మాత్రం తమ పంట భూములకు నీరందించే కాల్వలు బక్కచిక్కిపోవడం.. ఆక్రమణలకు గురికావడంతో ఆయకట్టుకు నీరందక అవస్థలు పడుతున్నారు. ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడెం వద్ద మేజర్‌ కాల్వ నుంచి పెదతండా సాయిబాబా గుడి వరకు వచ్చే మూడో కాల్వ ప్రస్తుతం కనుమరుగైంది. సుమారు 20 అడుగుల వరకు ఉన్న మూడో కాల్వ పల్లెగూడెం నుంచి రెడ్డిపల్లి, తాళ్లేసేతండా, పెదతండా వరకు వందల ఎకరాలకు సాగునీరు అందించేది. రానురాను వ్యవసాయ భూములుగా వెంచర్లుగా మారుతున్నాయి. ఇదే అదనుగా భావించిన రియల్టర్లు తాము కొనుగోలు చేసిన భూముల్లో కాల్వలను కూడా కలిపేసుకుంటున్నారు. ప్రస్తుతం మూడో కాల్వ అనేది నామరూపాలు లేకుండా పోయింది. దీని కింద కొద్దోగొప్పో భూమి ఉండి.. సాగు చేస్తున్న రైతుల భూములకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. రియల్టర్లు పెదతండా వద్ద తవుడు మిల్లు సమీపంలోని కాల్వలను తమ భూముల్లో కలుపుకుని వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేయడం గమనార్హం.  

ఏదులాపురం చెరువు కాల్వ మాయం..
ఏదులాపురం నుంచి పెదతండా, గుర్రాలపాడు మొదటి భాగం భూముల వరకు వెళ్లే నీటి కాల్వ ఒకప్పుడు 20 అడుగులకుపైగా ఉండేది. ప్రస్తుతం 5 నుంచి 6 అడుగులకు చేరింది. దీనినిబట్టి కబ్జాదారులు ఎంతకు బరితెగించారో ఇట్టే అర్థమవుతోంది. సుమారు 3 కిలోమీటర్ల దూరం వచ్చిన కాల్వ రెండు వైపులా కలిపి 15 అడుగుల వరకు ఆక్రమణకు గురికావడం చూస్తే ఇక్కడే ఏడెనిమిది ఎకరాలు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. వరంగల్‌ క్రాస్‌రోడ్‌ వద్ద ఓ రియల్టర్‌ ఏకంగా సాగర్‌ కాల్వ మధ్యలో ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. దర్జాగా పిల్లర్లు వేసి కొంత మేర గోడలు కూడా నిర్మించాడు. అప్పట్లో రెవెన్యూ, పంచాయతీ అధికారులను మచ్చిక చేసుకుని దర్జాగా నడీ కాల్వపై ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిపై రైతులు కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తర్జన భర్జనల నడుమ తొలగించారు. అలాగే వరంగల్‌ క్రాస్‌రోడ్‌ నుంచి పెదతండా వరకు, పక్కనే ఎఫ్‌సీఐ గోడౌన్ల ఎదురుగా, ఆటోనగర్‌ ప్రాంతంలో కూడా కాల్వ ఆక్రమణకు గురైంది.  

50 ఎకరాలు ఆక్రమణ
దశాబ్ద కాలంగా ఆక్రమణదారులు పంట కాల్వలను ఆక్రమించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై రైతులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేకపోవడంతో ఆక్రమణల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

20 అడుగుల కాల్వ ఉండేది..
పల్లెగూడెం నుంచి పెదతండా సాయిబాబా ఆలయం వరకు నాలుగు కిలోమీటర్ల మేర గతంలో 20 అడుగుల వెడల్పుతో పంట కాల్వ ఉండేది. అందులో వచ్చే నీటితో రెండు పంటలు పుష్కలంగా పండేవి. ప్రస్తుతం పంట భూములు ప్లాట్లుగా మారడంతో అసలు కాల్వే లేకుండా పోయింది. ఉన్న కొద్దిపాటి భూములకు నీరందడం లేదు.  – బాణోత్‌ తారాచంద్, పెదతండా

సాగునీటికి ఇబ్బందులు..
గతంలో ఏదులాపురం చెరువు నుంచి వచ్చే పంట కాల్వ 20 అడుగుల వరకు ఉండేది. ఇప్పుడది అయిదారు అడుగులకు మించిలేదు. కాల్వ వెడల్పు ఉన్నప్పుడు పంటలకు నీరు సమృద్ధిగా చేరేవి. పంటలకు కూడా నీటి ఇబ్బంది లేకుండా ఉండేది. కాల్వ వెడల్పు తగ్గడంతో నీళ్లు రావడం తగ్గింది. ఆయకట్టు కొన్నేళ్లుగా ఎండిపోతోంది.  – బాణోత్‌ సేవాలాల్, రైతు, పెదతండా

ఆక్రమిస్తే సహించేది లేదు..
ఎక్కడైనా పంట కాల్వలు ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు వరంగల్‌ క్రాస్‌రోడ్‌ ప్రాంతంలో సాగర్‌ పంట కాల్వపై రియల్టర్‌ నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాం. పంట కాల్వలు ఆక్రమిస్తే తమకు వెంటనే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. – బి.నర్సింహారావు, తహసీల్దార్‌

Read latest Khammam News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా