అభయ సీతారామ

20 Jan, 2018 08:07 IST|Sakshi

వీడిన అటవీ, పర్యావరణ చిక్కులు

సస్యశ్యామల ప్రాజెక్టు సాకార దిశగా..

ఇక కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమతులపై దృష్టి

సాక్షిప్రతినిధి, ఖమ్మం: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగేసింది. సాగునీటిపరంగా ఉమ్మడి జిల్లాకు వరప్రదాయనిగా భావిస్తున్న ప్రాజెక్టు విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూపిన చొరవ ఫలితంగా అవసరమైన అటవీ అనుమతులకు రీజినల్‌ ఎంపవర్‌ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చెన్నైలో శుక్రవారం పర్యావరణ, అటవీ అనుమతులపై రీజినల్‌ ఎంపవర్‌ కమిటీ సమావేశమైంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, దీనికి పై అనుమతులు ఇవ్వాల్సిందిగా.. సీతారామ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ పూర్తి వివరాలతో కమిటీ ఎదుట పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. నిర్మాణాలు, కాల్వల తవ్వకం, పంప్‌హౌస్‌ల నిర్మాణం వంటి వివరాలను పూర్తిస్థాయిలో వివరించడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి దశగా 1,531 హెక్టార్ల అటవీ భూమి అవసరమని, దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి అటవీ భూముల పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు అవసరమని పేర్కొన్నారు. దీనిపై సంతృప్తి చెందిన రీజినల్‌ ఎంపవర్‌ కమిటీ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు ఇచ్చేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసి.. అటవీ అనుమతులు ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్‌(ఎంఓఈఎఫ్‌) వారికి సిఫార్సు చేసింది. కమిటీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో కేంద్రం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

భక్తరామదాసు రెండో దశ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలానికి ఈనెల 12న సాగునీటిని విడుదల చేసిన మంత్రులు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా జరిగిన సభలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఒక కొలిక్కి వచ్చాయని.. ఇక తమ దృష్టి సీతారామ ప్రాజెక్టుపై సారిస్తామని, అటవీ పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన సాధిస్తామని ఘంటాపథంగా చెప్పారు. అనుమతుల అంశంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుతో తుమ్మల పలుమార్లు సమావేశం కావడం.. దీనిపై కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు తీసుకోవాలని తుమ్మల కోరడంతో ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి.. వాటిని కేంద్రానికి ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయంగా అటవీ భూముల్లో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరింది.  

ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పినపాక నియోజకవర్గం.. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గల దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.8వేల కోట్లు మంజూరు చేసింది. 115 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టేందుకు 8 ప్యాకేజీలుగా విభజించి ప్రభుత్వం టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసింది. వీటిలో ఐదు ప్యాకేజీల్లో పనులు కొనసాగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంప్‌హౌస్‌ల నిర్మాణం.. మరో రెండు ప్యాకేజీల్లో కాల్వల తవ్వకం చేపట్టారు. కాగా.. ఉమ్మడి జిల్లా రైతులకు ఉపయోగపడే సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు.

వన్యప్రాణి బోర్డు అనుమతులపై దృష్టి..    
సీతారామ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ లభించగా.. ఇక కేంద్ర వన్యప్రాణి బోర్డు నుంచి అనుమతులపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన ఇటీవల రాష్ట్ర వన్యప్రాణి బోర్డు గవర్నర్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర వన్యప్రాణి బోర్డు అనుమతించింది. వీటిని కేంద్ర వన్యప్రాణి మండలి అనుమతి కోసం నివేదించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కిన్నెరసాని అభయారణ్యం ఎకో జోన్‌ నుంచి 442 హెక్టార్ల అటవీ ప్రాంతానికి వన్యప్రాణి మండలి

అనుమతి తప్పనిసరిగా మారింది.
దీంతో రాష్ట్రస్థాయి వన్యప్రాణి బోర్డులో అనుమతిస్తూ.. తుది అనుమతి కోసం కేంద్ర వన్యప్రాణి మండలికి ప్రతిపాదించారు. సీతారామ ప్రాజెక్టు పరిధిలో వన్యప్రాణి సంరక్షణ కోసం రూ.2.41కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వన్యప్రాణులు తిరిగేందుకు 12 అండర్‌ పాసెస్‌లను ప్రతిపాదిస్తున్నారు. ఎకో బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టనున్నారు. గడ్డి పెంపకం, సాసర్‌పిట్‌లు నిర్మించి వన్యప్రాణులకు నీటి వసతి కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు