స్వచ్ఛతలో సత్తుపల్లి ర్యాంకెంత..?

7 Mar, 2019 11:56 IST|Sakshi
సత్తుపల్లి పట్టణ వ్యూ

స్వచ్ఛ సర్వేక్షన్‌–2019లో జాతీయ స్థాయి 65వ ర్యాంకు

స్వచ్ఛ మున్సిపాలిటీగా జిల్లాలో మొదటి స్థానం

సాక్షి, సత్తుపల్లి: కేంద్ర ప్రభుత్వం సత్తుపల్లి స్వచ్ఛతకు పట్టం కట్టింది. బుధవారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్‌–2019 ర్యాంకుల్లో సత్తుపల్లి మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో 65 ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం దక్కింది. జాతీయ స్థాయిలో 4,041 మున్సిపాలిటీతో పోటీపడి 4వేల మార్కులకు 2214.58 మార్కులు సాధించింది. అదేవిధంగా జాతీయస్థాయిలో ఇల్లెందు(389వ ర్యాంక్‌), మణుగూరు(953వ ర్యాంక్‌), కొత్తగూడెం(339వ ర్యాంక్‌), మధిర(501వ ర్యాంక్‌), పాల్వంచ(967వ ర్యాంక్‌) పొందాయి.

జనవరిలో సర్వే జరిపిన కేంద్ర ప్రత్యేక బృందాలు..

స్వచ్ఛ సర్వేక్షన్‌లో ర్యాంకు కేటాయించేందుకు జనవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్వే సంస్థ మున్సిపాలిటీలో సర్వే నిర్వహించింది. సెల్‌ఫోన్‌తో ప్రత్యేక యాప్‌ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో 200 మంది ప్రజల అభిప్రాయాలు సేకరించింది. రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, బహిరంగ మల విసర్జన, తాగునీటి సరఫరా, తడి, పొడి చెత్తల సేకరణ, డంపింగ్‌ యార్డ్, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.

మున్సిపాలిటీ : సత్తుపల్లి
విస్తీర్ణం : 18.90 చదరపు కిలోమీటర్లు
జనాభా : 31,893
వార్డులు : 20
నివాసాలు : 7,202
పారిశుద్ధ్య సిబ్బంది : 115 మంది
వాటర్‌ ట్యాంకర్లు : 2
పారిశుధ్య వాహనాలు : రిక్షాలు–12, ఆటోలు–2, డంపర్‌బిన్లు–20, డీసీఎం–1, ట్రాక్టర్లు–4
రోజువారీ సేకరించే చెత్త : 14 టన్నులు

చాలా సంతోషంగా ఉంది

దేశంలోనే సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో ఉత్తమ ర్యాంక్‌ రావటం చాలా సంతోషంగా ఉంది. వరంగల్‌ రీజియన్‌లో సత్తుపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛతలో మూడవ స్థానం లభించినందుకు గర్వంగా ఉంది. కౌన్సిలర్లు, ఉద్యోగులపై మరింత బాధ్యత పెరిగింది. ప్రధానంగా ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఈ ర్యాంక్‌ను సాధించగలిగాం.
– దొడ్డాకుల స్వాతి, చైర్‌పర్సన్, సత్తుపల్లి మున్సిపాలిటీ

అందరి కృషితోనే

సత్తుపల్లి మున్సిపాలిటీలోని అధికారులు, కార్మికులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఉత్తమ ర్యాంక్‌ సాధించగలిగాం. ఇదే స్ఫూర్తితో మరింత సుందరంగా సత్తుపల్లిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. పట్టణాభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలి.
– చీమా వెంకన్న, కమిషనర్, సత్తుపల్లి మున్సిపాలిటీ

మరిన్ని వార్తలు