లకారం జనహారం

12 Feb, 2018 15:11 IST|Sakshi

ఖమ్మంలో అట్టహాసంగా ట్యాక్‌బండ్‌ ప్రారంభం  

5కేరన్‌తో మురిసిన నగరం

నగరం జన ఉత్సాహంతో ఉప్పొంగింది. సింగారించుకున్న లకారం ట్యాంక్‌బండ్‌ను చూసి ప్రజలు మురిశారు. 5కే పరుగుతో సంబరాన్ని నింపారు. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించి..హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం అభివృద్ధి చెందుతోందని కితాబునిచ్చారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక శ్రద్ధతో లకారాన్ని..నగరానికి అలంకారంగా మార్చారని అభినందించారు. 

ఖమ్మంస్పోర్ట్స్‌: జాతరను మైమరపించిన జనంతో, ఉవ్వెత్తున ఎగిసిన క్రీడాభిమానంతో 5కే రన్‌ దిగ్విజయంగా కొనసాగింది. నిర్వాహకులు ఊహించిన విధంగానే 5కే రన్‌లో ప్రాతినిధ్యం వహించేందుకు వేలాదిగా ఖమ్మం నగరవాసులు తరలివచ్చారు. సర్దార్‌ పటేల్‌ స్టేడియం వద్ద రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారే పరుగెత్తాలి అని నిర్వాహకులు తెలపడంతో దాదాపు వెయ్యిమందికి పైగా నగర వాసులు, ఇతర జిల్లాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. తర్వాత నగరంలోని పలు సేవాసంస్థలు, క్రీడా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్‌ విద్యాసంస్థల వారు భాగస్వామ్యులయ్యారు.

ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, కలెక్టర్‌ లోకేష్‌కుమార్,  ఖమ్మం మున్సిపాల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ ఝూ, అడిషనల్‌ డీసీపీ కె.సురేష్‌కుమార్, బాలకిషన్, నగర మేయర్‌ డాక్టర్‌ జి.పాపాలాల్, 5కే రన్‌ నిర్వాహకులు దొడ్డ రవి, కురువేళ్ల ప్రవీణ్‌కుమార్, సినీనటులు పాల్గొన్నారు.

స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రన్‌ ఇల్లెందు క్రాస్‌రోడ్, కోర్టు మీదుగా మమత ఆస్పత్రి మార్గం నుంచి లకారం ట్యాంక్‌బండ్‌ వరకు చేరుకుంది. నిర్వాహకులు 40ఏళ్లలోపు పురుషులు, మహిళల స్థానాలు ప్రకటించారు. ముందుగా నమోదు చేసుకున్నవారు 16నిమిషాల్లో రన్‌ను ముగించగా, తర్వాత మిగతా వారు..అరగంటకు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. సర్దార్‌ పటేల్‌స్టేడియం నుంచి ప్రారంభమైన 5కే రన్‌తో లకారం ట్యాంక్‌బండ్‌ వరకు రోడ్లన్నీ జనంతో నిండాయి. స్టేడియంనుంచి లకారం ట్యాంక్‌బండ్‌ వరకు ఎక్కడ చూసినా జనమే కనిపించారు. క్రీడా సంఘాలకు చెందిన వారు తమ క్రీడాకారులను తీసుకుకొచ్చి రన్‌లో పాల్గొనే విధంగా చేశారు.  

చిప్‌ అనుసంధానంగా రన్‌.. 
జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన 5కే రన్‌లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. అథ్లెట్ల షూలలో ఒక చిప్‌ను అమర్చి, జీపీఎస్‌ ద్వారా వీరి గమనం తీరును పరిశీలించారు. తద్వారా తప్పుడు పద్ధతిలో గమ్యస్థానానికి చేరకుండా పకడ్బందీగా వ్యవహరించారు.  

భారీ బందోబస్తు.. 
అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా..పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. స్టేడియం ప్రాంతంలోని రెండురోడ్లలో ఒక మార్గాన్ని మూసివేశారు. భద్రత ఏర్పాట్లను అడిషన్‌ డీసీపీ కె.సురేష్‌కుమార్‌ పర్యవేక్షించారు. నగర ఏసీపీలు పీవీ.గణేష్, ట్రాఫిక్‌ ఏసీపీ సదా నిరంజన్, రెహమాన్, సీఐలు రాజిరెడ్డి, వెంకన్నబాబు, రమేష్, తిరుపతిరెడ్డి, నాగేంద్రచారి ఆధ్వర్యంలో నిరంతరం బందోబస్తు పర్యవేక్షించారు.  

విజేతలు వీరే.. 
40 ఏళ్లలోపు పురుషుల విభాగంలో నిర్వహించిన పరుగులో జి.విజయ్‌కుమార్‌(వరంగల్‌), ఆర్‌.రమేష్‌చంద్ర(మహబూబ్‌నగర్‌), ఎస్‌.వినోద్‌(ఖమ్మం), కె.తిరుపతి, వంశీ(ఖమ్మం అథ్లెటిక్స్‌ అకాడమీ) విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో బి.నవ్య(నల్లగొండ), పి.ఉషారాణి(యూసీపీఈ వరంగల్‌), తేజశ్రీ(ఖమ్మం) విజేతలుగా నిలిచారు.

సినీ తారల సందడి.. 

సినిమా తారలు శ్రీకాంత్, శివాజీ, శ్రీనివాసరెడ్డి, తారక్‌రత్న, హేమ, గాయకుడు సింహ తదితరులు హాజరై సందడి చేశారు. నృత్యాలతో ఉత్సాహం నింపారు. ఖమ్మం అంటే..కళాకారుల గుమ్మం..అని, ఇక్కడికి ఎప్పుడొచ్చినా కొత్తదనం కనిపిస్తుందని ఆనందంగా చెప్పారు. మా అసోసియేషన్‌ 25వ వేడుకను ఖమ్మంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. శాస్త్రీయ నృత్యాలు, సినీ గేయాలపనలు నగరవాసులను అలరించాయి.  

మరిన్ని వార్తలు