చనిపోయిన పాప కదిలిందంటూ..

31 Dec, 2017 12:22 IST|Sakshi

విజయవాడలో కలకలం రేపిన ఘటన 

బతికున్న మనిషిని చంపేశారని  బంధువుల ఆరోపణ

 అంత్యక్రియలకు తీసుకెళ్తే కదిలిందని గ్రహించిన బంధువులు

 ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా, మృతిచెందినట్లు నిర్ధారణ 

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రాణముండగానే.. బాలిక మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారనే ప్రచారం శనివారం నగరంలో కలకలం రేపింది. విజ యవాడ న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన పోతిన సాయిదుర్గ (14)  పదిరోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఈ నెల 25న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక తీవ్ర శ్వాసకోశవ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించి తొలుత అక్యుట్‌ మెడికేర్‌ (ఏఎంసీ)లో, అనంతరం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సచేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30కు బాలిక మృతి చెందడంతో బంధువులకు అప్పగించారు. 

అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా..
శనివారం మధ్యాహ్నంఅంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండగా బాలిక కదిలిందని బంధువుల్లో ఒకరికి అనుమానం వచ్చింది. ఆర్‌ఎంపీని తీసుకురాగా ఆయన నాడికొట్టుకుంటోందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో తమ బిడ్డను బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా వారంతా పాప చనిపోయిందని నిర్ధారించారు. అయినప్పటికీ పాప బతుకుతుందనే ఆశతో మళ్లీ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.  పోలీసుల సమక్షంలో ఈసీజీ తీసిన వైద్యులు బాలిక మరణించిందని తేల్చారు. 

మరిన్ని వార్తలు