బెజవాడ దుర్గమ్మ గుడిలో అలజడి

2 Jan, 2018 10:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దేవస్థానంలో అపచారం జరిగినట్టు తెలుస్తోంది. ప్రవిత్రమైన అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు రావడంతో అలజడి రేగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి సూర్యకుమారి ఆధ్వర్యంలో గత నెల 26న అర్ధరాత్రి ఈ తంతు జరిగినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో దేవస్థానం పాలక మండలి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. డిసెంబర్‌ 26న అమ్మవారి గర్భాలయం వద్ద అర్చకులు బదులు అపరిచిత వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు.

దీనిపై వివరణ ఇవ్వాలని ప్రధాన అర్చకుడిని ఆదేశించారు. అయితే ఆలయంలో ఎటువంటి తాంత్రిక పూజలు జరగలేదని ఈవో తెలిపారు. ఆలయంలో అలజడిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్భగుడిలో తాంత్రిక పూజలు జరిగాయన్న ప్రచారంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలు అరిష్టమని హిందూ పరిరక్షణ సమితి పేర్కొంది. ఈ వ్యవహారంపై దేవాలయ అధికారులు వివరణ ఇవ్వాలని, లేకుంటే పీఠాధిపతుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.

అతడి వల్లే వివాదం: మంత్రి
దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగలేదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ప్రధాన అర్చకుడు విశ్వనాథపల్లి బద్రినాథ్‌బాబు తన బంధువు రాజాను తీసుకెళ్లడం వల్లే అనుమానాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. అనుమతి లేకుండా బయటివ్యక్తిని గర్భగుడిలోకి తీసుకెళ్లం నేరమవుతుందని వెల్లడించారు.

బెజవాడ దుర్గమ్మ గుడిలో అలజడి

>
మరిన్ని వార్తలు