కన్నీటి ప్రార్థన

31 Dec, 2017 12:05 IST|Sakshi

మైలవరం: ప్రతివారం లాగే ఈ శనివారం కూడా వారు ఆనందంగా ప్రభువు ప్రార్థనలకు బయల్దేరారు. కుటుంబమంతా ఆనందంగా కలిసి వెళ్లేందుకు సొంత ఆటో కూడా కొన్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వారిని ఒక్కసారిగా చీకటి ఆవహించింది. కాసేపటికి హాహాకారాలు.. ఆర్తనాదాలు.. నిర్జీవంగా కొందరు.. హతాశులై మరికొందరు. మైలవరం జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం వద్ద కనిపించిన భీతాకర దృశ్యాలివి.

అంతా ఒకే కుటుంబం
మైలవరం నుంచి మండలంలోని పుల్లూరు చర్చిలో ప్రార్థనకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 11మంది ప్రయాణిస్తున్న ఆటోను జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో సగ్గుర్తి లత, ఆమె సోదరి గరికపాటి నాగమణి, సోదరుడు గరికపాటి నాగేశ్వరరావు, ఇంటర్‌ విద్యార్థిని మందా రాజేశ్వరి మృతిచెందారు. కాగా, మందా రూత మ్మ, పల్లెపోగు కన్యాకుమారి, పల్లెపోగు జన్ని, గరికపాటి యశస్విని, సగ్గుర్తి సుశీల, కటారపు రాణి, పల్లెపోగు జెస్సీ గాయాలపాలై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దైవ ప్రార్థనకు వెళ్తూ.
మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఆర్‌టీసీ కండక్టర్‌ సగ్గుర్తి రాజు కుటుంబం కొన్నేళ్లుగా మైలవరం రామకృష్ణ కాలనీలో ఉంటోంది. ప్రతి ఆదివారం వీరు మైలవరం నుంచి స్వగ్రామమైన పుల్లూరు చర్చికి ప్రార్థనల కోసం వెళ్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లేందుకు సొంత ఆటో కొన్నారు. ఎప్పటిలాగే శనివారం మధ్యాహ్నం 11మంది కుటుంబ సభ్యులు బయల్దేరారు. విధినిర్వహణలో ఉన్న రాజు ప్రార్థనలకు వెళ్లలేదు. మైలవరం శివారులోని దర్గా వద్దకు రాగానే మృత్యురూపంలో వస్తున్న కారు వీరి ఆటోను ఢీకొంది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టి రోడ్డు పక్కకు పడిపోయింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న 11 మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోడ్రైవర్‌ నాగేశ్వరరావును అంబులెన్స్‌లో విజయవాడ తరలిస్తుండగా మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలు కాగా, వారికి ప్రాథమిక చికిత్స అందించారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. 

మద్యం మత్తులోనే..
మైలవరం సమీపంలో 30వ నంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందడానికి కారణం మద్యం మత్తులో యువకులు అతివేగంగా కారు నడపడమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ఐదుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు షేక్‌ రసూల్‌ పాషా, లావూడియా మనోహర్, ముత్యాల సతీష్, డి.రాహుల్, బుద్దా ప్రవీణ్‌లు తమ స్నేహితుడు బెంగళూరు వెళ్తున్న సందర్భంగా బాపట్ల బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్తున్నారు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతున్న వీరు ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి రాంగ్‌రూట్‌లో కుడి వైపునకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది.  

జోగి రమేష్‌ పరామర్శ
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి జోగి రమేష్‌ సందర్శించి మృతుల కుటుంబీకులను పరామర్శించారు. జోగి రమేష్‌తో పాటు పార్టీ మైలవరం మండలం అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు షేక్‌ కరీమ్, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అప్పిడి సత్యనారాయణరెడ్డి, పుల్లూరు పీఎసీఎస్‌ అధ్యక్షుడు సీహెచ్‌ రామిరెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు. మైలవరం ఎంపీపీ బి.లక్ష్మి, నాయకులు కోమటి సుధాకరరావు, మల్లెల రాధాకృష్ణ, దూరు బాలకృష్ణ కూడా పరామర్శించారు. 

మరిన్ని వార్తలు