వచ్చేదెవరు..?

17 Jan, 2018 08:23 IST|Sakshi

చర్చనీయాంశంగా దుర్గగుడి ఈఓ పోస్టు

తాంత్రిక పూజల నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారి బదిలీ

ద్వారకా తిరుమల ఈఓ త్రినాథరావు వస్తారని ప్రచారం

అనుకూలమైన ఈఓ కోసం ఆలయ అధికారుల ప్రయత్నాలు

కొత్త ఈఓపై మౌనం వహిస్తున్న పాలక మండలి సభ్యులు

దుర్గగుడి కొత్త కార్యనిర్వహణాధికారిగా ఎవరు వస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మ ఆలయంలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈఓగా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్‌ అధికారి సూర్యకుమారి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో మళ్లీ ఐఏఎస్‌ను నియమిస్తారా లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారిని నియమిస్తారా? అన్న అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.  

సాక్షి, విజయవాడ:
దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా ఎవరు వస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది. మళ్లీ ఐఏఎస్‌ అధికారినే నియమిస్తారా? లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారిని నియమిస్తారా? అన్న అంశంపై ఇంద్రకీలాద్రిపై  పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం, అది వివాదాస్పదం కావడంతో కొన్ని రోజుల క్రితం వరకూ ఈఓగా బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్‌ అధికారి ఎ.సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతానికి దేవాదాయశాఖ కమిషనర్‌ వై.వి.అనూరాధ ఆలయ ఇన్‌చార్జి ఈఓగా బాధ్యతలు చూస్తున్నారు. మరో పక్షం రోజుల్లో ప్రభుత్వం కొత్త ఈఓను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంతో తమకు అనుకూలంగా ఉండే అధికారినే ఈఓగా తీసుకొచ్చేందుకు ఇద్దరు కీలకమంత్రుల చుట్టూ దేవస్థానానికి చెందిన కొంతమంది అర్చకులు, అధికారులు ప్రదక్షిణ చేస్తున్నారు.

ఐఏఎస్‌ వచ్చేనా?
దేవస్థానం ఈఓగా తిరిగి ఐఏఎస్‌ అధికారిని నియమిస్తారా? లేక దేవాదాయశాఖకు చెందిన రీజినల్‌జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారిని నియమిస్తారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల నుంచి ఈఓగా పనిచేసేవారు వివాదాస్పదం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈఓగా రావడానికి ఐఏఎస్‌లు సుముఖంగా లేరని తెలిసింది.

ముమ్మరంగా ప్రయత్నాలు
దుర్గగుడిలో దీర్ఘకాలంగా పనిచేసిన ఏఈఓ, సూపరింటెండెంట్లు, గుమస్తాలను కలిపి మొత్తం 23 మందిని ఇటీవల ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. అయితే అంగబలం, అర్థబలం ఉపయోగించి వారిలో కొందరు తిరిగి ఇక్కడకు చేరుకున్నారు. వారిలో అన్నదానం, ప్రసాదాలు తయారీ, స్టోర్స్‌ వంటి కీలకవిభా గాల్లో పనిచేసిన అధికారులు ఉన్నారు. వారే తిరిగి తమకు అనుకూలంగా ఉండే అధికారిని ఈఓగా తీసుకొచ్చేందుకు ముమ్మరంగా లాబీ నడుపుతున్నారని సమాచారం. దేవస్థానానికి చెందిన కొంతమంది అర్చకులు వారికి సహాయం చేస్తున్నారని తెలిసింది. త్రినాథరావు కాకపోతే సింహాచలం ఈఓగా ఉన్న రామచంద్రమోహన్‌ను అయినా దుర్గగుడి ఈఓగా నియమించాలనే వారు కోరుతున్నారని సమాచారం.

పాలకమండలి దూరం..దూరం
ఆలయంలో ఈఓగా పనిచేసిన తొలి మహిళా ఐఏఎస్‌ అధికారి సూర్యకుమారి దుర్గమ్మకు తాంత్రిక పూజలు చేయించారంటూ వ్యాఖ్యలు చేసి, చివరకు ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురైన పాలకమండలి సభ్యులు మాత్రం ఈఓ విషయంలో ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఈఓ గురించి మాట్లాడితే మరోసారి వివాదం అవుతుందని భావించే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఆలోచనలను మంత్రుల వద్దనే పంచుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

కోటేశ్వరమ్మ లేదా త్రినాథరావు
ముంబాయికి చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మ ఈఓగా వస్తారంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆమె అక్కడ రిలీవ్‌ కాలేదు. దీంతో ఆమె ఈఓగా రావడం సందిగ్ధంగా మారింది. ఈలోగా దేవస్థానంలో ఒకవర్గం తమకు అనుకూలంగా ఉండే అధికారిని ఈఓగా తీసుకొ చ్చేందుకు లాబీ నడుపుతోంది. ఐఏఎస్‌కు బదులు దేవాదాయశాఖకు చెందిన అధికారిని నియమిస్తేనే పరిస్థితుల్ని చక్కదిద్దుతారని ఆ వర్గం ప్రచారం చేస్తోంది.  ద్వారకా తిరుమల ఆలయ ఈఓ వి.త్రినాథరావును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన 2013 డిసెంబర్‌ నుంచి 2014 నవంబర్‌ వరకు దుర్గగుడి ఇన్‌చార్జి ఈఓగా ఏ విధమైన వివాదాలు లేకుండా పనిచేశారు. ద్వారకా తిరుమల ఆలయంలో ఐదేళ్ల నుంచి ఈఓ పనిచేస్తున్నారు. దీంతో ఆయన త్వరలో బదిలీ అవుతారని సమాచారం. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండే ఈఓను నియమించాలంటూ దుర్గగుడికి చెందిన కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ఇద్దరు మంత్రుల వద్దకు వెళ్లినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు