డెలివరీ బాయ్‌ది హత్యా?.. ఆత్మహత్యా!?

4 Mar, 2019 14:15 IST|Sakshi
ప్రేమ్‌కుమార్‌ మృతదేహం

 గ్యాస్‌ డెలివరీ  బాయ్‌ మృతిపై  అనుమానాలు 

 హత్య చేశారని కుటుంబ సభ్యుల వాదన 

 కొట్టి చంపి ఉరివేసుకున్నట్లు  చూపారని ఆరోపణ

 పోలీసుల అత్యుత్సాహంపై   బంధువుల అభ్యంతరం   

సాక్షి, అమరావతి బ్యూరో : మాచవరం ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఓ గృహంలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్‌ గత బుధవారం ఉరివేసుకొని మృతి చెందడం కలకలం రేపింది. అయితే పోలీసులు చెబుతున్నట్లు ఆ మృతదేహంపై ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనిపించలేదు. పైగా మృతదేహం నడుము భాగంలో దెబ్బలు తగిలి శరీరం కందిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయని కుటుంబ సభ్యుల వాదన. మృతుడి భార్య సైతం తన భార్య ఉరి వేసుకుని చనిపోయేంత పిరికివాడు కాదంటోన్న వైనం చూస్తుంటే పథకం ప్రకారం అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వ్యవహరించిన తీరు కూడా వారి అనుమానాలకు బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..  

విద్యాధరపురం కొండప్రాంతంలో నివాసముంటున్న ఆవాల ప్రేమ్‌కుమార్‌ ఆలియాస్‌ అనిల్‌ (28) గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. మధురానగర్‌కు సమీపంలోని ఓ గ్యాస్‌ కంపెనీలో విధులు నిర్వర్తిస్తుంటాడు. ఏడేళ్ల క్రితం మధురానగర్‌కు చెందిన గౌరి అనే యువతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పనికి వెళ్లినప్పుడు ఒక్కోసారి మధ్యాహ్న భోజనానికి మధురానగర్‌లోని అత్తారింటికి వెళ్లేవాడు. ఇలా తరచూ అక్కడికి వెళ్తున్న సమయంలోనే ఓ మహిళతో స్నేహం ఏర్పడింది. అది వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి దారితీసింది. గతంలో ఆ మహిళతో సన్నిత సంబంధాలు కొనసాగించిన ఓ వ్యక్తి ఇటీవల ఆ మహిళతో మాట్లాడవద్దని, వారి ఇంటికి రావొద్దని అనిల్‌కు వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. అయినా అనిల్‌ అతని మాటలు పట్టించుకోకుండా ఆ మహిళ ఇంటికి తరచూ రాకపోకలు సాగించాడు.

బుధవారం సాయంత్రం మధురానగర్‌లోని అత్త కళావతికి ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. కొంతసేపటికి రాత్రి 8 గంటల సమయంలో ప్రేమ్‌కుమార్‌ అమ్మకు పోలీసులు ఫోన్‌ చేసి మీ అబ్బాయి చనిపోయాడని, వెంటనే రావాలని చెప్పారు. దీంతో ఆమె తన కోడలు గౌరిని తీసుకొని  సంఘటనా స్థలానికి చేరుకుంది. వారు అక్కడికి చేరుకునేలోపే మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో ఉంచారు. వారు వచ్చి చూడగానే ఆ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరుసటిరోజు గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయగా, మధురానగర్‌కు సమీపంలో పూడ్చేశారు. అయితే పోలీసులు వ్యవహరించిన తీరు, మృతదేహంపై ఉన్న గుర్తులను గుర్తించిన మృతుడి కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని కచ్చితంగా హత్యేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య వెనుక ఎవరో బాడబాబులు ఉన్నారని.. వారి ఒత్తిడి వల్లే పోలీసులు దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.  

నా భర్తది ఆత్మహత్యకాదు.. 
నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడుకాదు. కావాలనే ఇంటికి రప్పించి చంపేశారు. ఆత్మహత్య చేసుకోవాలనిపించినా వివాహేతర సంబంధం ఉన్న ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది. పైగా నా భర్త నడుము సమీప భాగాన ఫ్యాంట్‌ చిరిగి ఉంది. కళ్ల వెంట నీరు కార్చిన గుర్తులు ఉన్నాయి. పెనుగులాట జరిగి ఉంటుంది. దీన్ని బట్టి ఇది ఆత్మహత్య కాదు. పోలీసులు నిజాలు నిగ్గు చేల్చాలి. 
– గౌరీ, మృతుడి భార్య
అనుమానాలున్నాయి..
గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ప్రేమ్‌కుమార్‌ మృతిని అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశాం. మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నట్లుగానే మాకు అనుమానాలు ఉన్నాయి. విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడే నిందితులపై చర్యలు తీసుకుంటాం. 
– శ్రీనివాస్, సీఐ, మాచవరం 

Read latest Krishna News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా