రెఢీ

6 Jan, 2018 07:55 IST|Sakshi

గ్రామాల్లో కోడిపందేల జోరు మొదలు

అడ్డుకుంటామంటున్న రెవెన్యూ, పోలీసులు

సజావుగా జరిగేందుకు అవగాహన ఒప్పందాలు

కీలక ప్రాంతాల్లో స్థలాల మార్పు

పందెంకోళ్లకు భారీ డిమాండ్‌

‘తెల్లారింది లెగండోయ్‌ కొక్కొరొక్కో..’ అంటూ పందెంకోళ్లు నిద్ర లేపుతుంటే, ‘పంతం నీదా.. నాదా.. సై..’ అంటూ పందెపురాయుళ్లు కత్తులు దూస్తున్నారు. సంక్రాంతి సందడి ప్రారంభమైందో లేదో గ్రామాల్లో కోడిపందేల జోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులను ప్రసన్నం చేసుకునే పనిలో కొందరుంటే, పందెం కోళ్లను దిట్టంగా పెంచి, కత్తులు సిద్ధం చేస్తున్నవారు మరికొందరు. మొత్తం మీద ఈ ఏడాది జిల్లాలో కోడిపందేలకు కోట్లు చేతులు మారుతున్నాయని సమాచారం.

సాక్షి, మచిలీపట్నం: సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. జిల్లాలో కోడిపందేల నిర్వహణకు పందెంరాయుళ్లు సన్నాహాలు మొదలుపెట్టేశారు. పైకి పందేలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టీకరిస్తున్న పోలీసులు లోపల పందెం రాయుళ్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు నిర్వహణ కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, కలెక్టర్‌ లక్ష్మీకాంతం కోడిపందేలను అడ్డుకునేందుకు అధికారులతో కూడిన ఓ కమిటీని నియమించారు. ఎక్కడైనా పందేలు జరిగినట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పందేల నిర్వహణపై ఉత్కంఠ ఏర్పడింది. ఒకవైపు పోలీసులు పందేలను ప్రోత్సహించేందుకు పావులు కదుపుతుండగా, మరోవైపు రెవెన్యూ అధికారులు ఏ మేరకు వాటిని నివారించగలరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ తంతు మొత్తం ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతుందన్నది వాస్తవం.

జిల్లాలో పరిస్థితి ఇదీ..
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఏటా కోడి పందేలు జోరుగా నిర్వహిస్తారు. పెడన నియోజకవర్గంలోని కొంకేపూడి, నందమూరు, పుల్లపాడు, కాకర్లమూడి, నందమూరు, బందరు రూరల్‌ మండలంలోని కానూరు, గోపువానిపాలెం, మేకవానిపాలెం, పోలాటితిప్ప, రుద్రవరం, మాలకాయలంక, చిన్నాపురం, ఘంటసాల మండలం కొడాలి, శ్రీకాకుళం, పాపవినాశనం, మొవ్వ మండలం కూచిపూడి, గోడపాడు, బార్లపూడి, భట్లపెనుమర్రు, గూడూరు, కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, గుడివాడ, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో జోరుగా నిర్వహిస్తారు. 

మోపిదేవిలో భారీ సెట్టింగులు
మోపిదేవీ మండలం వెంకటాపురం గ్రామంలో భారీస్థాయిలో పందేల నిర్వహణ జరగనుంది. ఏటా 30 ఎకరాల్లో టెంట్లు వేసి మరీ పందేల నిర్వహిస్తూ ఉంటారు. గత ఏడాది సినీ తారలు సైతం ఇందులో పాల్గొననుండటంతో వీటికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పందేలు సైతం భారీస్థాయిలో కాయడంలో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు. రూ.కోట్లు చేతులు మారతాయి. రూ.లక్ష నుంచి రూ.కోట్లల్లో పందేలు వేస్తుంటారు. కనీసం పందెం కాయాలంటే రూ.లక్ష ఉండాల్సిదేనన్న నిబంధన సైతం ఉంది. ఇప్పటికే పుంజులను పోషించే పనిలో పందెం రాయుళ్లు నిమగ్నమయ్యారు.

నిర్వహణపై అయోమయం
వాస్తవానికి కోడిపందేలు జరిగే పదిరోజుల ముందు నుంచీ వాటి విషయంలో స్పష్టత లేకపోవడం, చివరి నిమిషంలో ఏదోలా నిర్వహించడం, పరిపాటిగా మారింది. అయితే, ఈసారి హైకోర్టు ఘాటుగా స్పందించిన నేపథ్యంలో వీటిని ఇటు రెవెన్యూ, పోలీసు విభాగాలు ఎలా అడ్డుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఐదేళ్లుగా కోడిపందేల నిర్వహణ జిల్లాలో కొంతమంది నాయకులకు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు పందేల్లో పాల్గొనడం, ప్రారంభించడం చేశారు. అయితే, ఈ ఏడాది ముఖ్యమంత్రి సైతం పందేలకు దూరంగా ఉండాలని సూచించారు. వివిధ ప్రాంతాల పందెంరాయుళ్లు తమ ప్రాంతాల్లో పందేలు నిర్వహించాలని, ఆయా ప్రాంతాలకు పోలీసులు రాకుండా చూడాలని స్థానిక నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. 

బరులకు దారులివీ..
పందెంరాయుళ్లకు సంవత్సరం మొత్తం ఒక ఎత్తయితే సంక్రాంతి పండుగ మూడు రోజులు ఒక ఎత్తు. దీనికోసం కొంతమంది సంవత్సరం మొత్తం ఎదురుచూస్తారు. కొందరు కోళ్ల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఒక్కో కోడిని సంవత్సరం మొత్తం మేపడం ద్వారా దాని సామర్థ్యాన్ని బట్టి రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకూ అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇదే క్రమంలో ఈసారి పండుగకు కూడా కోళ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయి. 

స్థలం మార్చి.. ఏమార్చి..
ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రాంతాలను పక్కనపెట్టి ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో పందేల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. చిన్నచిన్న పందేలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, వీటి వివరాలు, ప్రాంతాలు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.  ఈసారి కూడా జిల్లాలో భారీగా పందేలు నిర్వహిస్తారని భావిస్తున్నారు.

కుదిరిన ఒప్పందం
పందేల నిర్వహణకు ఇప్పటి నుంచే పోలీసులు, నిర్వాహకులకు మధ్య ఒప్పందం కుదిరినట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక కేంద్రం నిర్వాహకుడు పోలీసులకు ముందస్తుగా రూ.10వేలు, నలుగురు వ్యక్తులు, ఆరు కోళ్లు అప్పగించాలి. నిర్వహణ సమయంలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న వీటిపై చర్యలు తీసుకున్నట్లు చూపించి కోర్టుకు పంపుతారు. దీంతో పందెం రాయుళ్లు మనుషులను వెతికే పనిలో పడ్డారు. కాగా, ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించనున్నారు.

ఏటా ఇదే తంతు
గ్రామాల్లో కోడిపందేలు భారీగా నిర్వహిస్తారనే ప్రచారం నడుస్తోంది. దీనికి తగ్గుట్టుగానే కొన్నేళ్లుగా పైన పేర్కొన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున పందేలు నిర్వహించిన దాఖాలాలు ఉన్నాయి. రెండేళ్లుగా వీటి విషయంలో పలువురు కోర్టుకు వెళ్లగా, వ్యాజ్యాలు కూడా నడిచాయి. కోడిపందేలను నిర్వహించకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్న తరుణంలో గడిచిన సంవత్సరం సుప్రీంకోర్టు కత్తులు కట్టకుండా, జీవులను హింసించకుండా ముందుకు వెళ్లవచ్చన్న వాదన తెరమీదకు తీసుకొచ్చింది. దీంతో పందెంరాయుళ్లు యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొంతమంది పక్కదోవ పట్టించారు. తాజాగా హైకోర్టు దీనిపై ఘాటుగా స్పందించింది. డీజీపీ, ప్రధాన కార్యదర్శులను బాధ్యులను చేసింది.

మరిన్ని వార్తలు