బయట వ్యక్తులు అంతరాలయం వద్ద ఉన్నది నిజమే!

3 Jan, 2018 11:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో రహస్యంగా తాంత్రికపూజలు నిర్వహించిన వ్యవహారం వెలుగుచూడటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఓ యువనేత పదవి కోసమే ఈ తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు వస్తుండటం రాజకీయ దుమారం రేపుతోంది. గత నెల 26న అర్ధరాత్రి శాంతస్వరూపినిగా ఉన్న దుర్గమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి.. భైరవీ పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. భైరవీ పూజలు నిర్వహిస్తే శక్తులు వస్తాయనే నమ్మకముంది. ఈ నేపథ్యంలో భైరవీ పూజలు నిర్వహించి.. అనంతరం మళ్లీ దుర్గామాతగా అలంకారాన్ని మార్చినట్టు సమాచారం.

బయట వ్యక్తులు అంతరాలయం వద్ద ఉన్నది వాస్తవమే!
దుర్గగుడిలో తాంత్రిక పూజల కేసులో లీగల్‌ తీసుకొని.. ఆ ప్రకారం నడుచుకుంటామని విజయవాడ వన్‌టౌన్‌ సీఐ కాశీ విశ్వనాథ్‌ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు పూజారులను విచారించామని తెలిపారు. దుర్గగుడి అంతరాయలం వద్ద బయట వ్యక్తులు ఉన్నది వాస్తవమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ పూజలకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తామన్నారు.

దుర్గగుడిలో ఎవరి కోసం పూజలు నిర్వహించారనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్నారు. ఈవో సూచనల మేరకే తాము అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్టు పూజారులు చెప్తున్నారు. మరోవైపు కిందిస్థాయి పూజారులపై నెపం నెట్టేసి.. ఈ వ్యవహారాన్ని ముగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అధికార పార్టీ నేతల అండ లేనిదే ఆలయంలో ఇంతటి అపచారం జరగదని పరిశీలకులు అంటున్నారు.

ఈవోపై వేటు..
ఈ వివాదం నేపథ్యంలో కనకదుర్గ ఆలయం ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఇన్‌చార్జ్‌ ఈవోగా రామచంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్‌ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

దుర్గగుడిలో తాంత్రికపూజల పేరిట అర్ధరాత్రి జరిగిన అపచారంపై హిందువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన, రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన దుర్గమ్మ సన్నిధిలో ఇలాంటి అపచారం జరగడమేమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా తాంత్రిక పూజలు నిర్వహించారని, ఈ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టకూడదని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు