ప్రేమ దీక్ష ఫలించింది

13 Jan, 2018 08:41 IST|Sakshi
అలివేలమ్మతల్లి ఆలయంలో పెళ్లి చేసుకుంటున్న ప్రేమికులు

మోసగించేందుకు ప్రయత్నించిన ప్రియుడు

ఇంటి ఎదుట దీక్ష 

ఎమ్మార్పీఎస్‌ జోక్యంతో పెళ్లి

కృష్ణా జిల్లా,చందర్లపాడు(నందిగామ): పెళ్లి కోసం చేపట్టిన నిరసన దీక్ష ఫలించింది. ప్రేమించి మోసగించేందుకు ప్రయత్నించిన ఇంటి ఎదుట ప్రియురాలు దీక్షకు దిగింది. ఎమ్మార్పీఎస్, పోలీసుల జోక్యంతో దిగివచ్చాడు. గురువారం రాత్రి గ్రామదేవత సాక్షిగా ఒక్కటయ్యారు.మండలంలోని కొడవటికల్లు గ్రామానికి చెందిన వేదాంతం పవన్‌కుమార్‌(24), తిరువూరు మండలం చౌటపల్లికు చెందిన దేవి(20) ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం దేవీ ఇంట్లో తెలిసింది. మందలించినప్పటికీ పవన్‌తో పెళ్లికి ఇష్టపడింది.

అయితే పెళ్లి విషయానికి వచ్చే సరికి మొఖం చాటేసిన పవన్‌ ఆమెకు మాయమాటలు చెప్పి తప్పించుకు తిరిగేవాడు. గుర్తించిన ఆమె తిరువూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకునేందుకు రెండు మాసాల గడువు కోరిన పవన్‌ అప్పటి నుంచి ముఖం చాటేశాడు. ఫోన్‌లో కూడా స్పందించకపోవడంతో  దేవి ఈ నెల 10న కొడవటికల్లులోని పవన్‌ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పింది. వారినుంచి సరైన సమాధానం రాకపోవండతో ఇంటి వద్దనే దీక్ష చేపట్టింది. ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆమెకు అండగా నిలిచారు. పవన్‌ కుమార్‌ను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పవన్‌ పెళ్లికి అంగీకరించాడు. గురువారం రాత్రి చందర్లపాడు గ్రామదేవత అలివేలమ్మతల్లి సాక్షిగా ఒక్కటయ్యారు.

>
మరిన్ని వార్తలు