గుండె రక్తనాళాల పూడికలో బైపాస్‌ సర్జరీకి చెక్‌

6 Feb, 2018 12:30 IST|Sakshi
మాట్లాడుతున్న జె.శ్రీమన్నారాయణ

ఆప్టికల్‌ కోబెరాన్స్‌ టోమోగ్రఫీ ద్వారా స్టంట్‌లు

ఆంధ్రా హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఘనత

లబ్బీపేట (విజయవాడ తూర్పు): క్లిష్టమైన గుండె రక్తనాళాల్లో పూడికలకు బైపాస్‌ లేకుండా కాంప్లెక్స్‌ యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్‌ అమర్చే విధానంపై సోమవారం ఆంధ్రా హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్‌షాపు నిర్వహించారు. జర్మనీకి చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మీరోస్లేవ్‌ ఫెరెస్క్‌ పాల్గొన్నారు. ఒకసారి బైపాస్‌ సర్జరీ,  స్టెంట్‌లు అమర్చిన వారికి కాల్షియం కారణంగా మళ్లీ పూడికలు ఏర్పడగా, వాటిని రోటబ్రేటర్‌ ద్వారా ఆప్టికల్‌ కోబెరాన్స్‌ టోమోగ్రఫీ అనే నూతన పరిజ్ఞానంతో తొమ్మిది మందికి స్టెంట్‌లు విజయవంతంగా అమర్చారు.

అనంతరం ఆంధ్రా హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ జె.శ్రీమన్నారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఈ విధానం గుండె జబ్బుల వైద్యంలో విప్లవాత్మక మార్పుగా పేర్కొన్నారు. మచిలీపట్నంకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి ఎడమ మెయిన్‌ 90 శాతం బ్లాక్‌ అయిందన్నారు. ఆ వయస్సులో బైపాస్‌ సర్జరీ చేయడానికి ఆరోగ్యం సహకరించదని, ఈ వర్క్‌షాపులో అతనికి యాంజియో ప్లాస్టీ ద్వారా పూడికలు తొలగించి స్టెంట్‌ అమర్చినట్లు తెలిపారు. ఈ వర్క్‌షాపులో విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు పలుప్రాంతాల నుంచి 20 మంది కార్డియాలజిస్టులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి కార్డియోథోరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దిలీప్, డాక్టర్‌ తులసీరామ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు