రేపు కొల్లేరులో తాటిదోనెల పోటీలు

2 Feb, 2018 09:35 IST|Sakshi
నీటిలో రాకెట్‌లు తాటి దోనెలు

కైకలూరు: కొల్లేరు సాంప్రదాయక వేటకు తాటి దోనెలు చిరునామాలు. మూడేళ్ల విరామం అనంతరం అటవీశాఖ తాటి దోనెల పోటీలు నిర్వహించనుంది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కైకలూరు మండలం సర్కారు కాల్వ వద్ద ఈ పోటీలు జరుగుతాయి. మత్స్యకారులు ఈ పోటీలకు సిద్ధమవుతున్నారు. ప్రథమ బహుమతి రూ.10,000, ద్వితీయ బహుమతి రూ.5,000, తృతీయ బహుమతి రూ.3,000గా నిర్ణయించారు. కొల్లేరులో 2005 ఫిబ్రవరి 2న అప్పటి రేంజర్‌ సునీల్‌కుమార్‌ మొదటిసారి దోనెల పోటీలను నిర్వహించారు.

నీటిలో రాకెట్‌లు తాటి దోనెలు
కొల్లేరు సరస్సులో చేపల వేటకు తాటి దోనెలను ఉపయోగిస్తారు. ముందుగా ఓ బలమైన తాటిచెట్టును ఎంపిక చేసుకుని దానిని మొదలుతో సహా తీసుకొస్తారు. 15 రోజుల పాటు బరిసెతో చెక్కుతారు. నీరు చేరకుండా తారును అద్దుతారు. దీనిలో ఇద్దరు ప్రయాణించవచ్చు. తాటిదోనెలపై మావులను (చేపలు పట్టడానికి ఉపయోగించే కర్రల బుట్ట) తీసుకెళ్లి వేట సాగిస్తారు. ఈ తాటిదోనెలను నడపడం ఎంతో కష్టం. సాంప్రదాయ చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు మాత్రమే వీటిని ఉపయోగించగలరు.

సంప్రదాయం కొనసాగించాలి
కొల్లేరు సరస్సులో చేపల చెరువుల సాగు విస్తీర్ణం పెరగడంతో తాటి దోనెల ఉపయోగం తగ్గింది. ఇంజను ఇనుప పడవల వాడకం ఎక్కువైంది. పూర్వం కొల్లేరులో 4వేల జనాభాలో కనీసం 1000 తాటి దోనెలు ఉండేవి. ప్రస్తుతం ఒక్కో గ్రామానికి కేవలం 10 దోనెలకు పరిమితమైంది. మయ్యింది. ఈ సందర్భంగా అటవీ శాఖ కన్జర్వేటర్‌ ఆఫ్‌ పారెస్ట్‌ రామచంద్రరావు మాట్లాడుతూ చిత్తడి నేలల ఆవశ్యకతను తెలిపేందుకు తాటి దోనెల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. 

Read latest Krishna News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు