అమ్మవారి పట్ల మహాపచారం

4 Jan, 2018 01:18 IST|Sakshi

ఇంద్రకీలాద్రిలో తాంత్రిక పూజలపై భగ్గుమంటున్న పండితులు 

ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా దుర్గమ్మ కళాన్యాస కవచం తొలగింపు 

సాక్షి, అమరావతి బ్యూరో:  ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం మహాపచారానికి ఒడిగట్టింది. వేల ఏళ్లుగా పాటిస్తున స్మార్త వైదిక ఆగమ శాస్త్రాన్ని అపహాస్యం చేసింది. ఆది శంకరాచార్యులు ఏనాడో పరిపుష్టం చేసిన కళాన్యాసాన్ని దెబ్బతీసింది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శాంత స్వరూపిణిగా, శక్తి రూపంగా చేసిన కళాన్యాస కవచాన్ని తొలగించడం ద్వారా ఘోర తప్పిదానికి పాల్పడింది. కేవలం చినబాబు నారా లోకేశ్‌కు రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే కోట్లాది మంది మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసిందని భక్తులు మండిపడుతున్నా రు. ఆలయంలో తాంత్రిక పూజలు చేసిన సర్కారు దుశ్చర్య పట్ల రాష్ట్రవ్యాప్తంగా స్మార్త వైదిక ఆగమ పండితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కళాన్యాసం అంటే? 
కనకదుర్గమ్మ ఉగ్రరూపంలో ఇంద్రకీలాదిపై స్వయంభూగా వెలసింది. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలను తన చల్లని చూపులతో కటాక్షించాలని అమ్మవారిని వేడుకుంటూ మూలవిరాట్‌ను కళాన్యాసంతో పరిపుష్టం చేశారు. స్మార్త వైదిక ఆగమం ప్రకారం కళాన్యాసంలో 10 విభాగాల కింద మొత్తం 96 కళలు ఉంటాయి. ఈ కళలను అమ్మవారి మూలవిరాట్‌లో పరిపుష్టం చేసి, కవచం తొడిగారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు మహిమాన్వితమైన ఆ కవచాన్ని కదిపి ఘోర అపరాధానికి పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు