వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి

5 Feb, 2018 11:53 IST|Sakshi
జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దీపా వెంకట్, చిత్రంలో వెంకయ్యనాయుడు, లావు నాగేశ్వరరావు, వెంకటేష్, కోడెల

స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఆకట్టుకున్న హీరో వెంకటేశ్‌

కృష్ణాజిల్లా , గన్నవరం: దేశానికి వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు వంటివని, అటువంటి వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న గ్రామీణ ప్రజలంతా పట్టణాలకు వలస వెళ్తుండడం వల్ల భవిష్యత్‌లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని అదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆదివారం జరిగిన  స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ రెండో వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించే విధంగా ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల్లో స్నేహభావంతో పాటు ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు. దేశ జనాభాలో 35 శాతం మంది ఉన్న యువతను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు.

యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి కల్పించాలనే ఉద్ధేశంతోనే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ను స్థాపించడం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారం లేకుండానే ప్రైవేట్‌ సంస్థల సాయంతో నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ కేంద్రాలుగా యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ శిక్షణ, వైద్య సేవలను కూడా అందిస్తున్నట్లు వివరించారు. త్వరలో విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో ట్రస్టును స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలు, యువత, రైతుల ప్రాధాన్యతను గుర్తించి వారిలోని నైపుణ్యాభివృద్ధికి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రముఖ సినీనటుడు వెంకటేష్‌ మాట్లాడుతూ కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించి ట్రస్ట్‌లో సేవాలందించాలని ఉందన్నారు. అనంతరం ఒమేగా హస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఇండియన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్, సీపీ గౌతమ్‌ సవాంగ్, పలువురు ట్రస్టు ప్రతినిధులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు