దివిలో ‘దివ్య’ పథం

20 Jan, 2018 01:07 IST|Sakshi

ప్రపంచాన్ని ఆకర్షించిన విజయవాడ మహిళా పైలట్‌ దివ్య

చిన్న వయసులో బోయింగ్‌ 777కు కమాండర్‌ బాధ్యతలు

గన్నవరం: ప్రపంచంలోనే అతి పిన్న వయసులోనే బోయింగ్‌ 777 విమానం నడిపిన తొలి మహిళా కమాండర్‌గా గుర్తింపు పొందిన యానీ దివ్య శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ముంబై విమాన సర్వీస్‌ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. దివ్య తండ్రి పఠాన్‌కోట్‌లో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగిగా పనిచేశారు. ఆమె అక్కడే జన్మించారు. తండ్రి పదవీ విరమణ అనంతరం ఆమె కుటుంబం స్వస్థలమైన విజయవాడకు వచ్చి స్థిరపడింది.

విజయవాడలోనే పాఠశాల విద్య పూర్తి చేసిన దివ్య 17 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరన్‌ అకాడమీలో చేరి పైలట్‌ శిక్షణ పూర్తిచేసుకుంది. 19 ఏళ్లకే ఎయిరిండియాలో కెరీర్‌ ప్రారంభించింది. తర్వాత స్పెయిన్, లండన్‌లో బోయింగ్‌ 737 విమాన పైలెట్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసుకుని 21 ఏళ్ల వయస్సులో అతిపెద్ద విమానం బోయింగ్‌ 777 నడపడం ప్రారంభించింది. అతి చిన్న వయసులో బోయింగ్‌ నడిపిన తొలి మహిళగా దివ్య ప్రపంచాన్ని ఆకర్షించారు. ఎయిరిండియాలో ఆమెకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్నప్పటికి టికెట్‌ కొనుగోలు చేసి ముంబైకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరిన్ని వార్తలు