శ్రీశైల దేవస్థానం సీఎస్‌వోపై వేటు

10 Jan, 2018 01:25 IST|Sakshi

శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో)గా విధులు నిర్వర్తి స్తున్న కె. నాగేశ్వరరావుపై వేటు పడింది. గిరిజన యువకుడు అంకన్నను చితకబాదిన సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈవో భరత్‌గుప్త.. సీఎస్‌వోను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా రిటైరైన నాగేశ్వరరావు ఐదు నెలల క్రితం తిరిగి సీఎస్‌వోగా చేరారు. కాగా, ఆలయ ప్రాంగణంలో భక్తులు పడేసే చిల్లరను ఏరుకుంటున్నాడంటూ సోమవారం మధ్యాహ్నం గిరిజన యువకుడు బయల అంకన్న (17)ను సీసీ కెమెరాల కంట్రోల్‌ రూమ్‌లో లాఠీతో నాగేశ్వరరావు చితకబాదారు.

ఈ దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో అదే రోజు రాత్రి ఆయనను వి«ధుల నుంచి తప్పిస్తూ ఈవో ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. సీఎస్‌వో తనను కులం పేరుతో దూషిస్తూ లాఠీతో దాడి చేశారంటూ బాధితుడు అంకన్న మంగళ వారం వన్‌టౌన్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నేత బలమురి పరమేశ్వర్, కొమురం భీం సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఆశీర్వాదం దేవస్థానం ఈవోకు, వన్‌టౌన్‌ ఎస్‌ఐకు వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు