అర్చకులపై అటెండర్‌ పెత్తనం!

6 Jan, 2018 09:40 IST|Sakshi

హారతి పళ్లెంలో వేసే కానుకల్లో  వాటా కావాలంటూ పట్టు  

ఒప్పుకోక పోవడంతో కక్ష సాధింపు చర్యలు  

మూకుమ్మడి సెలవులో వెళ్లేందుకు నోటీసులు ఇచ్చిన అర్చకులు

ఆళ్లగడ్డ: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో ఓ అటెండర్‌..అర్చకులపై పెత్తనం చెలాయిస్తున్నాడు. భక్తులు దయతలచి హారతి పళ్లెంలో వేసే కానుకుల్లో వాటా కావాలని పట్టుబడుతున్నాడు. వాటా ఇవ్వని పక్షంలో కక్ష గట్టి అర్చకులను వేధిస్తున్నాడు. హారతి పళ్లెంలో వేసే కానుకలను గుడిలో విధులు నిర్వహించే అర్చకుడు, పరిచారకులు ఇద్దరు సగం, సగం పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  పంపకాల్లో కొంత మొత్తం (రూ. 100 వరకు )  అక్కడ ఆ రోజు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఇస్తారు.  అయితే ఈ మధ్యకాలంలో కానుకలు బాగా వస్తున్నాయని మంత్రి అనుచరుడిగా చెప్పుకుంటున్న ఓ అటెండర్‌ కొందరు సిబ్బందితో కలిసి ఆలయ అధికారికి ఆశలు రేకెత్తించారు.

అధికారుల తరఫున ఆ అటెండర్‌.. అర్చకుల దగ్గరకు వెళ్లి  ఇక మీదట కానుకలు మూడు భాగాలు చేయాలని అందులో ఒక భాగం తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొందరు అర్చకులు అడ్డుచెప్పడంతో హారతి పళ్లెంలో వేసే కానుకలు అన్నీ హుండీలో వేయిస్తున్నారు. అంతే కాకుండా ప్రసాదాల తయారీకి అందించే నిధుల్లో భారీగా కోతలు విధించారు. దీంతో పూర్వం నుంచి చేస్తున్న ఆచార వ్యవహారాలు కొనసాగించలేక పోతున్నామని కొంతమంది అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర సరుకులతోనే ప్రసాదాలు తయారు చేసి స్వామికి నివేదిస్తూ, ఉభయదారులకు సర్దుతున్నారు. ఇంత జరుగుతున్నా మఠం ప్రతినిధులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది.  

ఆందోళనకు సిద్ధమవుతున్న అర్చకులు
ఎన్నడూ లేని విధంగా ఓ అటెండర్‌ పెత్తనం చలాయిస్తూ ఉండడంతో అర్చకులంతా మూకుమ్మడి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అర్చకులందరూ సంతకాలు చేసి రాతపూర్వకంగా అహోబిలం మఠం ప్రతినిధి సంపత్‌కు ఫిర్యాదు కూడా చేశారు. చర్యలు తీసుకోకపోతే వైదిక కార్యక్రమాలు నిలిపి గుడి ఎదుట నిరసనకు దిగాలని సమాయత్తమవుతున్నారు.

ఖర్చు ఎక్కువ అవుతోంది
కల్యాణం నిర్వహించే సమయంలో భక్తులు రూ.800తో కేసరి టికెట్‌ తీసుకుంటున్నారు. దేవస్థానానికి రూ. 2300 ఖర్చు అవుతోంది. దీంతో నష్టం వస్తుందని రూ. 800 మేరకు సరిపోయే సరుకులు మాత్రమే ఇస్తున్నాం.   – కామేశ్వరి, అహోబిలం ఈఓ 

మరిన్ని వార్తలు