రాయలసీమ అభివృద్ధిపై బీజేపీ డిక్లరేషన్‌

23 Feb, 2018 15:49 IST|Sakshi

సాక్షి, కర్నూలు : రాయలసీమ సమస్యల పరిష్కారానికి ఆ ప్రాంత భారతీయ జనతా పార్టీ నాయకులు శుక్రవారం కర్నూలులో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీమ అభివృద్ధిపై బీజేపీ నేతలు  డిక్లరేషన్‌ను విడుదల చేశారు.  రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు జిల్లాలను ఎనిమిదికి పెంచాలని ఈ డిక్లరేషన్‌లో సూచించారు. అలాగే రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించి రాజ్యాంగబద్ధత కల్పించడంతో పాటుగా రూ.10వేల కోట్లు కేటాయించాలని కోరారు.

సీమలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర‍్వహించాలని, వచ్చే బడ్జెట్‌లో రాయలసీమకు రూ.20వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. 2019కల్లా గాలేరు-నగరి, హంద్రీనీవా, గురు రాఘవేంద్రస్వామి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలని సూచనలు చేశారు. ఇక అధికారమంతా ఒకేచోట ఉండకూడదని, వికేంద్రీకరణ తక్షణమే జరగాలని ... సీమలో హైకోర్టు సాధన కోసం 28న కడపలో ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ వెల్లడించారు. హైకోర్టు ఏర్పాటుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని రాయలసీమ బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు