పాత ప్రాజెక్టులను పూర్తి చేసే అదృష్టం నాకు దక్కింది: సీఎం

8 Jan, 2018 02:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసే అదృష్టం తనకు దక్కిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని 27 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఇంటింటా నీటి వినియోగంపై ఆడిట్‌ జరగాల్సిన అవసరముందన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. డెల్టాకు ఇవ్వాల్సిన శ్రీశైలం నీటిని హంద్రీ–నీవాతో పాటు సిద్ధాపురానికి ఇస్తున్నామని చెప్పారు. ఈ నెలలో సూర్యారాధన అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. ఇదిలాఉండగా, సమయం దాటిన తర్వాత అనధికార వ్యక్తులు దుర్గమ్మ గుడిలోకి వెళ్లినట్టు రుజువయ్యిందని సీఎం చెప్పారు. అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించి, వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. అయితే తాంత్రిక పూజలపై మాత్రం నోరుమెదపలేదు.

ఫొటోల కోసం నిలదీయడం అలవాటైంది..: శనగపంటకు గిట్టుబాటు ధర కల్పించి.. కొనుగోలు చేయాలని సభకు హాజరైన రైతులు డిమాండ్‌ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోల కోసం నిలదీయడం అలవాటైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై సీఎం తన అక్కసు వెళ్లగక్కారు. ఎవరైనా ప్రశ్నించగానే.. ఫొటోలు తీసి వేస్తోందంటూ నోరుపారేసుకున్నారు.  

మరిన్ని వార్తలు