యూనిఫాం.. ఇంకెప్పుడు?

5 Feb, 2018 13:20 IST|Sakshi
పాత బట్టలతో బడికొచ్చిన పాములపాడు ఎంపీపీ స్కూల్‌ విద్యార్థులు

మరో రెండున్నర నెలల్లో ముగియనున్న విద్యా సంవత్సరం   

ఇప్పటి వరకు  ప్రభుత్వ పాఠశాలల్లో 70 శాతం మందికి మాత్రమే పంపిణీ

ఎయిడెడ్, కస్తూరిబా పాఠశాలలకు అందని యూనిఫాం

ఆదర్శ పాఠశాలల్లో   ప్రతిపాదనలకు లభించని అనుమతి

పాతబట్టలతో బడికెళ్తున్న పిల్లలు చోద్యం చూస్తున్న ప్రభుత్వం

కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు అందరూ సమానమే అనే భావన కల్పించేందుకు ప్రతి ఏటా యూనిఫాం అందజేస్తారు. అయితే, జిల్లాలో కొందరికి మాత్రమే ఇచ్చారు. మిగతా వారికి  ఇంకా ఇవ్వకపోవడంతో వారంతా  చిరిగిన పాత బట్టలతోనే బడికెళ్తున్నారు.  రెండున్నర నెలలు ఉంటే 2017–18 విద్యాసంవత్సరమే ముగుస్తుంది.. ఇంకెప్పుడు యూనిఫాం ఇస్తారని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అందించాల్సిన సర్కారు మాత్రం  పట్టనట్టు వ్యవహరిస్తోంది. 

ప్రతి ఏటా విద్యా సంవత్సరం మొదట్లోనే విదార్థులకు యూనిఫాం అందజేయాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో నేటికీ  పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందలేదు. కారణమేమిటంటే.. మొదట్లో  క్లాత్‌ అందించే బాధ్యత  ఆప్కోకు అప్పగించిన సర్కారు తర్వాత కుట్టి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.  దుస్తులు కుట్టేందుకు జిల్లాల వారీగా   ఆప్కో ఒప్పందం చేసుకుంది. ఇక్కడ అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి తమవారికే ఆ కుట్టు బాధ్యతలు ఇవ్వాలని తీసుకోవడం..తర్వాత జాప్యం చేయడంతో పూర్తి స్థాయిలో విద్యార్థులకు యూనిఫాం అందించలేని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి కొలతలు లేకుండా కుట్టడంతో కొన్ని పెద్దగా, మరికొన్ని చిన్నవిగా ఉండడంతో చాలా మంది విద్యార్థులు వాటిని వేసుకోలేకపోతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలలకు సైతం అరకొరగానే!   
జిల్లాలో 2940 ప్రభుత్వ, ఎయిడెడ్, కస్తూరిబా, ఏపీ మోడల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 1914, ప్రాథమికోన్నత 475, ఉన్నత పాఠశాలలు 551 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 4,00,824 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1 తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాలలకు  మాత్రమే యూనిఫాం పంపిణీ చేస్తారు. సర్వశిక్ష అభియాన్‌ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 3,20,714 మందికి యూనిఫాం అందించాలి.  ఇప్పటి వరకు ప్రభుత్వ, మండల పరిషత్‌ ప్రైమరీ పాఠశాలలకు చెందిన   2,91,149(బాలురు–1,39,959, బాలికలు–1,51,932) మంది విద్యార్థులకు మాత్రమే పంపిణీ చేశారు.   మరో రెండున్నర నెలలుంటే విద్యాసంవత్సరమే ముగిసిపోతుంది. ఇంకా  ఎయిడెడ్‌స్కూళ్లలో 15,932, కేజీబీవీల్లో 6360, ఏపీ మోడల్‌  స్కూళ్లలో  8,118 మంది పిల్లలకు దుస్తులు అందలేదు.  ఇదిలా ఉంటే ఏపీ మోడల్‌ స్కూళ్లలో యూనిఫాం ఇచ్చేందుకు ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం గమనార్హం.   

‘ఆదర్శ’ విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలని ప్రతిపాదించాం
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన  2.91 లక్షల మంది విద్యార్థులకు యూనిఫాం ఇచ్చాం. ఇంకా కొందరికి ఇవ్వాల్సి ఉంది. కస్తూరిబా స్కూళ్లకు చెందిన 6,360 మందికి ఇవ్వాల్సి ఉండగా, వీరిలో కొందరికి యూనిఫాం నేరుగా ఆయా స్కూళ్లకే పంపించినట్టు తెలిసింది. అయితే ఎంత మందికి వచ్చిందనే విషయంపై స్పష్టత లేదు. ఆదర్శ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు యూనిఫాం కోసం ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీకి ప్రతిపాదనలు చేశాం. అక్కడి నుంచి అనుమతులు రాలేదు.

మరిన్ని వార్తలు