సరిహద్దు గ్రామాలపై నిఘా 

10 Mar, 2019 14:11 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న నాలుగు జిల్లాల అధికారులు

సాక్షి, కర్నూలు/ మంత్రాలయం: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా వేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంయుక్త చర్యలకు ఉపక్రమించారు. మంత్రాలయంలోని అబోడి ఫంక్షన్‌ హాలులో శనివారం జరిగిన సరిహద్దు జిల్లాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు, రాయచూరు, జోగులాంబ గద్వాల,  బళ్లారి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, ఎక్సైజ్‌ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల సందర్భంగా సాంకేతికతను విరివిగా వినియోగించాలని నిర్ణయించారు. ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి.. పరస్పరం సమాచారాన్ని పంచుకోనున్నారు. సరిహద్దుల్లో ప్రత్యేకంగా ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి సమన్వయంతో ముందుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. డ్రైడే రోజు కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పాటు సరిహద్దుల్లోని మద్యం దుకాణాలను మూసివేయించాలని నిర్ణయించారు. మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.  సరిహద్దు ప్రాంతాల్లో జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా పేలుడు పదార్థాలను సరఫరా చేసే డీలర్లను గుర్తించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టడం, నగదు, చీరలు, ముక్కుపుడకలు, ఇతరత్రా కానుకల పంపిణీ, దొంగ ఓట్లు వేయడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ ఫక్కీరప్ప,  రాయచూరు కలెక్టర్‌ శరత్, ఎస్పీ కిషోర్‌బాబు,  బళ్లారి అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్,  జోగులాంబ గద్వాల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నిరంజన్‌రావు, ఎస్పీ లక్ష్మీనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు