రాతిగుండు రహస్యం చెప్పేనా?

5 Feb, 2018 13:27 IST|Sakshi
లభ్యమైన రాతి గుండ్లు

చెన్నంపల్లి కోటలో రాతి గుండ్లు లభ్యం

ఆయుధ భాండాగారం ఉందని ప్రచారం

చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల వేట రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్న విషయం విదితమే. ఆదివారం.. ఎనిమిది రాతి గుండ్లు, గదుల ఆకారంలో రెండు గుంతలు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పట్టువదలకుండా ఇక్కడ తవ్వకాలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కర్నూలు జిల్లా, చెన్నంపల్లి (తుగ్గలి): కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో 36 రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో ఆదివారం రాతి గుండ్లు బయటపడ్డాయి. గుప్త నిధులు, నిక్షేపాలంటూ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 13న కోటలో తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఇటుకలు, ఎముకలు, ఇనుప ముక్కలు బయటపడ్డాయి. తరువాత జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అధికారుల సూచన మేరకు.. ఈనెల 3న తవ్వకాలు పునఃప్రారంభించారు. ఆదివారం ఎనిమిది గుండ్రటి రాతి గుండ్లు బయట పడ్డాయి. వీటిని ఫిరంగి గుండ్లుగా భావిస్తున్నారు. గదుల ఆకారంలో రెండు గుంతలు ఉండడం, రాతి గుండ్లు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికా రులు భావిస్తున్నారు. జీఎస్‌ఐ అధికారులు మూడు చోట్ల తవ్వకాలు జరపాలని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు అధికారులు తవ్వకాలు జరుపనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీ ఓబులేసు, తహసీల్దార్‌ గోపాలరావు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు